మెక్సికోలో ఏలియన్ చేప!
మెక్సికోలో ఓ అరుదైన చేప జాలర్ల చేతికి చిక్కింది. ఇంతకుముందు అల్బినో షార్క్ జాతికి చెందిన ఇలాంటి చేపలను ఎక్కడా చూడకపోవడంతో అరుదుగా కనిపించిన ఈ వింత ఆకారాన్ని గ్రహాంతర జీవిగా వారు భావించారు. అందుకే దాన్ని ఏలియన్ ఫిష్ అని పిలుస్తున్నారు. మనిషి చర్మాన్ని పోలిన చర్మం, కొంతవరకు మానవ శరీరాకృతిలో కనిపిస్తున్న అల్బినో షార్క్‌ను మెక్సికోలోని ఓ ప్రాంతంలో నీటి అడుగు భాగాన గుర్తించారు.
తెలుపు, గులాబీ రంగుల కలయికతో ఉన్న చర్మం... అటు చేప, ఇటు మానవ శరీరాకృతులను పోలి ఉన్న అల్బినో ఫిష్‌ను కాబో సమీపంలో వేటకు వెళ్లిన జామీ రెన్డాన్ ఓడలోని ఓ జాలరి గుర్తించాడు. ఆకురాయిలా గరుకుగా ఉన్న చర్మంతోనూ, మూడు వరుసల పళ్లతోనూ, తలకు ఇరువైపులా మూడు గ్రిల్స్ లాంటి రంధ్రాలతోనూ ఈ వింత చేప శరీరం ఉందని రెన్డాన్ తెలిపాడు. ఆ చేప కనిపించగానే ఎంతో ఆశ్చర్యానికి లోనయ్యానని, నిజంగా దాని కళ్లు మనిషి కళ్లలా చాలా విచిత్రంగా ఉన్నాయని అతడు ప్రిస్సెస్ స్పార్ట్ ఫిషింగ్ ఫ్లీట్ పేరున కొనసాగుతున్న ఓ బ్లాగ్‌కు షార్క్ వివరాలను వెల్లడించాడు.
అనంతరం నిపుణులు ఈ తెల్లని చేపను అల్బినో స్వెల్ షార్క్‌గా గుర్తించారని, ఈ గ్రహాంతర జీవి ప్రమాదంలో ఉండటంతోనే బయటకు వచ్చి ఉంటుందని భావిస్తున్నారని రెన్డాన్ తెలిపాడు. తమకు చిక్కిన ఆ ఏలియన్ చేపను నిపుణులు గుర్తించిన తర్వాత తిరిగి జాగ్రత్తగా నీటిలోకి పంపించినట్లు జాలర్లు చెబుతున్నారు. ఈ చేపలు మనుషులకు ఎలాంటి హాని కలిగించవని, వాటికి హాని కలిగిస్తారనుకున్న జీవులు కానీ, మనుషులు కానీ కనిపించినపుడు ప్రాణరక్షణ కోసం అవి కడుపు నిండా నీటిని నింపి ఆకారాన్ని అతి పెద్దగా మార్చుకుంటాయని నిపుణులు తెలిపారు.