అమెరికా బందీలుగా వలసదారుల పిల్లలు
ట్రంప్ జీరో టాలరెన్స్‌తో తల్లిదండ్రులకు దూరమైన పిల్లలను 30 రోజుల్లోగా వారి కుటుంబాలతో కలపాలని డెడ్‌లైన్ విధిస్తూ అమెరికా కోర్టు తాజా ఆదేశాలు జారీచేసింది. అమెరికా చొరబాటు దారుల కుటుంబాలనుంచి వేరు చేసిన దాదాపు 2000 మందికిపైగా చిన్నారులు తిరిగి ఎప్పుడు తమ వారిని కలుసుకుంటారో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. దీంతో వేరు చేసిన కుటుంబాలను ఐక్యం చేసేపనిని వేగవంతం చేయాలని కోరుతూ అమెరికాలోని సివిల్ లిబర్టీస్ యూనియన్ దాఖలు చేసిన పిటిషన్‌పై కాలిఫోర్నియా కోర్టు ఈ విధంగా స్పందించింది.
ఆదేశాలు జారీ అయిన 14 రోజుల్లోగా ఐదేళ్ళ లోపు పిల్లలను తల్లిదండ్రుల దగ్గరికి చేర్చాలనీ మంగళవారం అమెరికాలోని శాన్ డియగో జిల్లా న్యాయమూర్తి దాయనా సాబరౌ ఆదేశించారు. అలాగే పది రోజుల్లోగా తల్లిదండ్రులతో, పిల్లలను ఫోన్‌లో మాట్లాడించే ఏర్పాటు చేయాలని కూడా కోర్టు స్పష్టం చేసింది. న్యూయార్క్, కాలిఫోర్నియాతో సహా 17 రాష్ట్రాల్లో ఒంటరిగా కేజ్‌ల్లో మగ్గుతోన్న పిల్లలను తల్లిదండ్రుల వద్దకు చేర్చాలని కోర్టుకెళ్ళారు.
అయితే దేశంలోని అతిపెద్ద వలసదారుల షెల్టర్ చీఫ్ ఎక్సిక్యూటివ్ జువాన్ సాన్‌చెజ్ మాత్రం తల్లిదండ్రుల దగ్గరికి పిల్లలను చేర్చడానికి ఇంకా నెలలు పట్టొచ్చని తెలిపారు. పిల్లలను తల్లిదండ్రుల వద్దకు చేర్చే ప్రక్రియలో ఆలస్యం జరుగుతుండడం ఇందుకు కారణమని నాన్ ప్రాఫిట్ సౌత్ వెస్ట్ కీ ప్రోగ్రామ్స్ సాన్‌చెజ్ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. తమ పిల్లల ఆచూకీ తెలుసుకునేందుకు తల్లిదండ్రులు ప్రయత్నించగా దాదాపు 1800 నంబర్లకు ఫోన్‌లు కలవలేదనీ, ఆ ఫోన్లన్నీ నో సిగ్నల్స్ అనో, బిజీ అనో వస్తున్నాయని టెక్సాస్ డిటెన్షన్ ఫెసిలిటీ వలసదారుల న్యాయవాదులు తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment