పడిపోతున్న అమెరికా ఆయుధాల అమ్మకాలు
న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా ఆయుధాల అమ్మకాల్లో అమెరికా క్రమక్రమంగా వెనకబడుతోంది. ఆ స్థానంలో యూరప్ దేశాలు తమ మార్కెట్లను పెంచుకుంటున్నాయి. ప్రపంచంలో అమెరికా ఆయధాల విక్రయాలు తగ్గడం వరుసగా ఇది ఐదో సంవత్సరం. అయినా ఇప్పుటికీ ఆయుధాలు ఎగుమతి చేయడంలో అమెరికాదే అగ్రస్థానం. ఆయుధాల అమ్మకాల్లో ఇప్పటికీ 54 శాతం వాటా అమెరికాదే. అమెరికా ఆయుధాల అమ్మకాలు తగ్గిపోవడానికి కారణం తన రక్షణ కేటాయింపులపై పరిమితులు విధించడమేనని స్టాక్హోమ్ లోని అంతర్జాతీయ శాంతి పరిశోధనా సంస్థ తెలియజేసింది.
2014వ సంవత్సరంతో పోలిస్తే 2015 సంవత్సరానికి ఆమెరికా ఆయుధాల అమ్మకాలు మూడు శాతం తగ్గాయి. 2015 సంవత్సరంలో రష్యా అయుధాల అమ్మకాలు 6.2 శాతం పెరిగాయి. 2014లో 48 శాతం, 2013లో 20 శాతం పెరిగాయి. వరుసగా అమ్మకాల్లో చెప్పుకోతగ్గ పురోభివృద్ధి ఉన్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అమ్మకాల్లో రష్యా అమ్మకాల వాటా ఇప్పటికీ 8.1 శాతం మాత్రమే. రక్షణ ఉత్పత్తులను పెంచడానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ వాటిపై పెట్టుబడులను తీవ్రంగా పెంచుతూ పోతున్నారు. 2025 సంవత్సరం నాటికల్లా ఈ పెట్టుబడులను 70,000 కోట్ల డాలర్లకు పెంచాలన్నది ఆయన లక్ష్యం. 2015 సంవత్సరంలో అమెరికా 20,900 కోట్ల డాలర్ల ఆయుధాలను విక్రయించడం ఇక్కడ గమనార్హం. అంటే ఈవిషయంలో అమెరికాను అధిగమించి నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకోవడం రష్యా లక్ష్యంగా కనిపిస్తోంది.
ఫ్రెంచ్ రక్షణ సంస్థలు కూడా తమ అమ్మకాలను క్రమంగా పెంచుకుంటున్నాయి. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 2015 సంవత్సరంలో ఫ్రెంచ్ రక్షణ కంపెనీలు తమ అమ్మకాలను 13 శాతం పెంచుకున్నాయి. ఈజిప్టు, ఖతార్, జర్మనీ కంపెనీలకు ఆయుధాలను విక్రయించడం ద్వారానే ఈ కంపెనీలు దాదాపు 7 శాతం అమ్మకాలను పెంచుకున్నాయి. 2014 సంవత్సరంతో పోలిస్తే 2015 సంవత్సరానికి బ్రిటీష్ కంపెనీలు కూడా ఆయుధాల అమ్మకాలను 2.8 శాతం పెంచుకున్నాయి. ద క్షిణ కొరియా అమ్మకాల్లో 2015 సంవత్సరానికే 32 శాతం వృద్ధిరేటు కనిపించింది. అయితే ఇందులో ఎక్కువ వాటాను దేశ సైన్యమే కొనుగోలు చేసింది. చైనా ఆయుధాల అమ్మకాలకు సంబంధించిన వివరాలు మాత్రం అందుబాటులో లేవు.