వారిలో విభిన్న ఆలోచనలు..
మనిషి సంఘజీవి. అతిని చుట్టూ రకరకాల అనుబంధాల తీగలను పెనవేసుకొని సమాజంలో మనుగడ సాగిస్తుంటాడు. అయితే కొందరి విషయంలో మాత్రం ఇది విభిన్నంగా ఉంటుంది. కుటుంబంతో పాటు ఎలాంటి సంబంధాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఒంటరిగా జీవితాన్ని గడిపేస్తుంటారు. ఇలాంటి వారిపై అమెరికాలోని చికాగో యూనివర్సిటీకి చెందిన ఇద్దరు మానసిక శాస్త్రవేత్తలు విస్తృతమైన పరిశోధనలు జరిపి ఒంటరి వారి ఆలోచనలు సంఘజీవులతో పోల్చినప్పుడు చాలా విభిన్నంగా ఉంటాయని నిర్ధారించారు.
ఈ పరిశోధనలో ఒంటరిగా జీవించడానికి అలవాటు పడిన వారి మెదడు పనితీరు చాలా విభిన్నంగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. ముఖ్యంగా సమాజంలో తమకు ఎదురయ్యే ఆపదల పట్ల చాలా అప్రమత్తంగా ఉండేలా వారి మెదడు ట్యూన్ చేయబడి ఉంటుందని తెలిపారు. ఒంటరివారి ఆలోచనలు 'స్వీయ రక్షణ' అనే అంశానికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నట్లు గుర్తించారు. నిజంగానే తమకు ఏ విధమైన హాని లేకపోయినప్పటికీ స్వీయ రక్షణకు ఒంటరి వారు ఇచ్చినటువంటి ప్రాధాన్యతను కుటుంబాలతో గడిపే వారు ఇవ్వరని నిర్థారించారు.
పరిశోధనలో భాగంగా 'బిలాంగ్', 'పార్టీ', 'ఎలోన్', 'జాయ్' అనే పదాలను విన్పించినప్పుడు మిగతావారితో పోల్చితే ఒంటరివారిలో విపరీతమైన ప్రతిస్పందనలు గమనించినట్లు గుర్తించారు. అయితే ఈ స్పందనలు వారికి తెలియకుండానే అసంకల్పితంగా వెలిబుచ్చారని తెలిపారు. సమాజంపై గల ప్రతికూల ఆలోచనల ఫలితంగానే వారి మెదడు ఇలా ట్యూన్ చేయబడుతుందని అందుకే ఇలాంటి స్సందనలు గమనించినట్లు శాస్త్రవేత్తలు కార్టెక్స్ జర్నల్లో తమ ఫలితాలను ప్రచురించారు.
పరిశోధనలో తేలిన మరో విషయం ఏమిటంటే.. ఒంటరితనం అనేది మనసులో తాము వేరు చేయబడ్డామని ఏర్పరుచుకునే ఒక భావన. కొందరు ఎంతో మంది స్నేహితులు, బంధువులను కలిగి ఉన్నప్పటికీ తాము ఒంటరివారిమనే భావనలోనే ఉంటారని తెలిపారు.