వాషింగ్టన్: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా భారత్‌లో పెద్ద ఎత్తున నిరసలు వెల్లువెత్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు అమెరికాలోని కొన్ని నగరాల్లోని ఎన్‌ఆర్‌ఐలు సీఏఏకు మద్దతుగా ర్యాలీలు కూడా నిర్వహిస్తున్నారు. కానీ.. సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌లను వ్యతిరేకిస్తూ సియాటెల్ నగర కౌన్సిల్ తీర్మానం చేసింది. ఈ చట్టం ముస్లింలు, అణగారిన వర్గాలు, మహిళలు, ఎల్‌జీబీటీలపై వివక్ష చూపుతోందని పేర్కొంది. భారతీయ అమెరికన్ సిటీ కౌన్సిల్ సభ్యుడు క్షమా సావంత్ సీఏఏ రద్దు తీర్మానాన్ని కౌన్సిల్‌లో ప్రవేశపెట్టారు. భారత పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన సీఏఏను రద్దు చేయడం ద్వారా భారత రాజ్యాంగంపై నమ్మకం పెరుగుతుందని ఆయన అన్నారు.
అదేవిధంగా జాతీయ పౌర రిజిస్టర్(ఎన్‌ఆర్‌సీ)ను నిలిపివేసి ఐక్యరాజ్యసమితి ఒప్పందాల ప్రకారం శరణార్థులకు సాయం చేయాడానికి చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. సీఏఏ, ఎన్‌ఆర్‌సీ రద్దు చేయాలని సియాటెల్ కౌన్సిల్ చేసిన తీర్మానాన్ని ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్ అధ్యక్షుడు అహ్సాన్ ఖాన్ సమర్ధించారు. ‘మత స్వేచ్చను అణగదొక్కాలని చూసేవారికి ఈ తీర్మానం ఓ సందేశంగా మారుతుంది. ప్రజల పట్ల ద్వేషం, మతోన్మాదంతో ప్రవర్తించకూడదు. కొన్ని చట్టాల విషయంలో అంతర్జాతీయ ఆమోదాన్ని కూడా పొందాలి’ అని ఆయన తెలిపారు. ఇటీవల పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా యూరోపియన్ యూనియన్ కూడా తీర్మానం ప్రవేశపెట్టి ఓటింగ్ నిర్వహించాలనుకున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment