మరణ తేదీని చెప్పేందుకు ఓ యాప్!!
మనిషికి తాను ఎంతకాలం బతుకుతానో.. ఎప్పుడు చనిపోతానో తెలుసుకోవాలన్న ఆసక్తి ఉండటం సర్వసాధారణం. కానీ అది తెలియడం అంత సులభం కాదనుకుంటున్నారా.. అయితే మీకోసం ఇదుగో, ఓ యాప్ సిద్ధంగా ఉంది. 'డెడ్లైన్' అనే ఈ యాప్.. మీ ఐఫోన్లో ఉన్న హెల్త్కిట్ టూల్ నుంచి సమాచారం మొత్తాన్ని స్కాన్ చేసి, మీరు ఏరోజు మరణిస్తారో చెప్పేస్తుంది. ఎత్తు, బీపీ, ఎంతసేపు పడుకుంటున్నారు, రోజుకు ఎంత నడుస్తున్నారు.. ఇలాంటి వివరాలన్నింటినీ ఈ యాప్ లెక్కకట్టేస్తుంది. ఈ సమాచారాన్ని ఉపయోగించి, దానికి మీ జీవనశైలికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు జోడించి.. వాటి సమాధానాల ద్వారా సుమారుగా మీ మరణ తేదీని చెబుతుంది.
వాస్తవానికి ఏ యాప్ కూడా కచ్చితంగా మనం మరణించే తేదీని చెప్పలేపదని, కానీ ఇది మాత్రం వాస్తవానికి మన ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసి అవసరమైన పక్షంలో వైద్యుడిని సంప్రదించాలని కూడా సూచిస్తుందని ఈ యాప్ను డెవలప్ చేసిన జిస్ట్ ఎల్ఎల్సీ సంస్థ యాపిల్ ఐట్యూన్స్ పేజీలో రాసింది. మంచి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, రోజూ తప్పనిసరిగా వ్యాయామం చేయడం ద్వారా మరణాన్ని వాయిదా వేసుకోవచ్చని కూడా అంటున్నారు.