'పాక్‌కు నిధులు ఆపేసి మంచిపనిచేశారు'
న్యూఢిల్లీ: పాకిస్థాన్‌కు నిధుల సహాయాన్ని నిలిపివేసే నిర్ణయం తీసుకున్నందుకు అమెరికా చట్టసభ ప్రతినిధి టెడ్ పో సంతోషం వ్యక్తం చేశారు. తమ దేశం చాల మంచి నిర్ణయం తీసుకుందంటూ ఆయన ట్వీట్ చేశారు. పాకిస్థాన్ ఒక వెన్నుపోటు దేశం అని ఆయన అన్నారు. మంగళవారం ఆయన చేసిన ట్వీట్‌లో పాకిస్థాన్ పలు ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయం ఇస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమెరికా రక్షణ శాఖ సెక్రటరీ జేమ్స్ మాట్టిస్ చాలా మంచి నిర్ణయం తీసుకున్నారని, ఉగ్రవాదం నిరదోధించేందుకు అమెరికా నిధుల సహాయం చేస్తుంటే పాక్ మాత్రం వాటిని ఉగ్రవాదులకు మద్దతిచ్చే కార్యక్రమాలకు ఉపయోగిస్తుందన్నారు. 'నేషనల్ డిఫెన్స్ ఆథారైజేషన్ చట్టం కింద డిఫెన్స్ సెక్రటరీ కచ్చితంగా వెన్నుపోటు దేశమైన పాకిస్థాన్ హక్కానీ నెట్‌వర్క్‌పై తగిన చర్యలు తీసుకుంటుందా లేదా అనే విషయాన్ని పరిశీలించాలి' అని ఆయన కోరారు.