ఉగ్ర మూకలన్నిటిపై ఎక్కుపెట్టాలి
పాకిస్తాన్‌కు అమెరికా స్పష్టీకరణ
తాలిబాన్, హక్కానీ, లష్కరే సంస్థలు పాక్‌కు, పొరుగు దేశాలకు, అమెరికాకు ముప్పుగా పరిణమించాయి
ఉగ్రవాదులకు చోటిస్తే వచ్చే ముప్పుకు షెషావర్ ఘటనే తార్కాణం
పాక్ పర్యటనలో తేల్చి చెప్పిన అమెరికా విదేశాంగ మంత్రి జాన్‌కెర్రీ
ఇస్లామాబాద్: ఉగ్రవాదం విషయంలో ఎలాంటి భేదాలూ చూపకుండా చర్యలు చేపట్టాలని పాకిస్తాన్‌కు అమెరికా స్పష్టంచేసింది. పాకిస్తాన్‌తో పాటు భారత్, అమెరికా వంటి దేశాలకు ప్రపంచానికి ముప్పుగా పరిణమించిన లష్కరే తోయిబా, తాలిబాన్, హక్కానీ వ్యవస్థలన్నిటిపైనా ఆయుధం ఎక్కుపెట్టాలని సూచించింది. ఉగ్రవాదంపై పోరాటంలో పాక్ తీసుకునే చర్యలను తాము వేచి చూస్తామని ఆ దేశ నాయకత్వానికి తెలియజేసింది. సోమవారం భారత పర్యటన ముగించుకుని అహ్మదాబాద్ నుంచి పాక్‌లో పర్యటన కోసం ఆ దేశ రాజధాని ఇస్లామాబాద్‌కు చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి జాన్‌కెర్రీ.. పాక్ జాతీయ భద్రతా సలహాదారు సర్తాజ్ అజీజ్, ప్రధానమంత్రి నవాజ్‌షరీఫ్ తదితరులతో భేటీ అయ్యారు. కెర్రీ మంగళవారం అజీజ్‌తో కలిసి ఇస్లామాబాద్‌లో మీడియాతో మాట్లాడారు.
‘‘పాకిస్తానీ తాలిబాన్లు, అఫ్గాన్ తాలిబాన్, హక్కానీ నెట్‌వర్క్, లష్కరే తోయిబా వంటి ఉగ్రవాద సంస్థలు పాకిస్తాన్‌కు, దాని పొరుగు దేశాలకు, అమెరికాకు ముప్పుగా పరిణమించాయి. ఈ దేశంలో కానీ, మరెక్కడైనా కానీ ఈ ఉగ్రవాదులు పాదం మోపకుండా చేసేలా చూడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. ఎలాంటి పొరపాటూ చేయవద్దు.’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
ముష్కర మూకలు హక్కానీ, లష్కరే
2008లో అఫ్గానిస్థాన్‌లోని భారత రాయబార కార్యాలయంపై దాడిచేసి 58 మంది ప్రాణాలను బలితీసుకున్న బాంబు దాడికి, 2011లో కాబూల్‌లోని అమెరికా రాయబార కార్యాలయంపై దాడికి, ఆ దేశంలో భారీ ట్రక్కులతో జరిగిన బాంబు దాడులకు పాల్పడింది హక్కానీ నెట్‌వర్కే. అఫ్గానిస్థాన్‌లో హక్కానీలు ప్రాబల్యం పెంచుకోవడానికి పాక్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ తెరవెనుక నుంచి మద్దతునిస్తోందని అమెరికా, అఫ్గాన్ అధికారులు పదేపదే చెప్పారు. కానీ ఈ ఆరోపణలను పాక్ తిరస్కరించింది. ఇక లష్కరే తోయిబా 2008 నవంబర్‌లో ముంబైలో మారణకాండకు తెగబడి 166 మందిని పొట్టనపెట్టుకోవటంతో సహా భారత్‌పై అనేక దాడులకు పాల్పడింది.
ఉగ్రవాదులకు చోటిస్తే వచ్చే ముప్పుకు షెషావర్ విషాదమే తార్కాణం...
‘ఉగ్రవాదులు తన భూభాగంలో స్థానం కల్పించటం వల్ల, తన భూభాగం నుంచి పనిచేసేందుకు అవకాశం ఇవ్వటం వల్ల తనకే పొంచి వున్న పెను ముప్పుకు డిసెంబర్ 16నాటి విషాదం తార్కాణం’ అంటూ పాక్‌లోని పెషావర్‌లో ఒక సైనిక పాఠశాలపై గత నెలలో జరిగిన ఉగ్రవాద దాడిలో విద్యార్థులతో సహా 150 మంది ప్రాణాలు కోల్పోయిన ఉదంతాన్ని కెర్రీ ప్రస్తావించారు. అమెరికా ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఇటు పాక్‌లో, అటు అఫ్గానిస్థాన్‌లో దాడులకు పాల్పడుతున్న ఉగ్రవాద సంస్థలకు ఆలవాలంగా మారిన నార్త్ వజీరిస్థాన్ ప్రాంతంలో ఉగ్రవాదుల ఏరివేతకు పాక్ గత ఏడాది జూన్‌లో సైనిక చర్య ప్రారంభించిందని కెర్రీ చెప్పారు. ఈ సైనిక చర్యలో 1,500 మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చారని.. ఫలితాలు ఉన్నప్పటికీ సైనిక చర్య ఇంకా పూర్తి కాలేదన్నారు.
ఉగ్రవాద సంస్థలపై భేదం లేదు: పాక్
అజీజ్ స్పందిస్తూ.. ఉగ్రవాద సంస్థలన్నిటిపై ఎలాంటి భేదం లేకుండా చర్యలు చేపడతామని కెర్రీకి హామీ ఇచ్చారు. ‘‘ఇక్కడి నుంచి అఫ్గానిస్థాన్‌లో కార్యకలాపాలు నిర్వహించే వారి (హక్కానీ నెట్‌వర్క్) సామర్థ్యం దాదాపుగా అదృశ్యమైంది. మా సైనిక బలగాలు భవిష్యత్తులో మరికొంత కాలం ఉగ్రవాద వ్యతిరేక చర్యల్లో నిమగ్నమై ఉంటాయి’’ అని ఆయన పేర్కొన్నారు. ఉగ్రవాదులతో సైన్యం పోరాడుతున్న ప్రాంతాల పునర్నిర్మాణానికి అమెరికా సాయం కావాలని ఆయన కోరారు. దీనికి కెర్రీ స్పందిస్తూ ముందుగా కేటాయించిన నిధుల్లో 250మిలియన్ డాలర్లను నార్త్ వజీ రిస్థాన్‌లో సహాయ చర్యలకు ఇస్తామన్నారు.
పాక్ చర్యలపై వేచి చూస్తాం...
మంచి ఉగ్రవాదులు, చెడ్డ ఉగ్రవాదులు అనే భేదమేమీ తమకు ఉండదని.. అందరిపై చర్యలు చేపడతామని అమెరికాకు పాక్ హామీ ఇచ్చిందని కెర్రీ వెంట పర్యటిస్తున్న అమెరికా ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ఆసక్తికరమైనవని.. ఎందుకంటే ఇప్పటివరకూ పాక్ ఉగ్రవాదుల్లో మంచి వారు, చెడ్డవారు అనే భేదం చూపించినట్లు భావించాల్సి వస్తుందని పేరు బహిర్గతం చేయడానికి నిరాకరించిన సదరు అధికారి విశ్లేషించారు. అయితే.. ఇప్పటికైనా ఉగ్రవాద సంస్థలన్నిటిపై ఎలాంటి తేడా లేకుండా చర్యలు చేపడతామని పాక్ హామీ ఇవ్వటం ఆహ్వానించదగ్గదని చెప్పారు. ఇది వాస్తవంగా ఎంతవరకూ కార్యరూపం దాలుస్తుందనేది వేచి చూడాల్సి ఉంటుందని.. నిజం ఏమిటనేది చేసే పనిలో తేలుతుందన్నారు. ఇదిలావుంటే.. పెషావర్‌సైనిక పాఠశాలను సందర్శించేందుకు జాన్‌కెర్రీ తలపెట్టిన పర్యటన.. వాతావరణం అనుకూలించనందున రద్దు చేశారు.
మా దేశంలో ఉగ్రవాదులకు భారత్ సాయం చేస్తోంది: పాక్
పాకిస్తాన్‌లో ఉగ్రవాద సంస్థలకు భారత్ సాయం చేస్తోందని పాక్ రక్షణమంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఆరోపించారు. ‘‘పాక్‌కు సంబంధించి భారత్‌కు కొన్ని ప్రణాళికలు ఉన్నాయి. పాక్ లోపల దారుణమైన దురాగతాలకు పాల్పడేందుకు ఉగ్రవాదులకు భారత్ సాయం అందిస్తోంది. తాలిబాన్‌కు భారత్‌తో సంబంధాలున్నాయి. పశ్చిమ సరిహద్దుల్లో యుద్ధం నుంచి దృష్టి మళ్లించి.. తూర్పు సరిహద్దులో కొట్లాటలతో పాక్ తలమునకలై ఉండాలని భారత్ కోరుకుంటోంది. బలూచిస్థాన్‌లోని ఉగ్రవాదంలోనూ భారత్ ప్రమేయాన్ని విస్మరించరాదు’’ అని ఆయన మంగళవారంపాక్ పత్రిక ‘డాన్ న్యూస్’తో పేర్కొన్నారు. ఈ ఆరోపణలకు ఆధారాలను అందించాలని ప్రశ్నించగా అనుభవాలు, విశ్వాసాలు ఈ ఆరోపణలకు ఆధారమని వ్యాఖ్యానించారు.