ఐఫోన్ యూజర్లకు యాపిల్ సారీ!
తమకు తెలిసిన మెకానిక్ తో హోమ్ బటన్ ను మార్పిడి చేసుకున్న ఐఫోన్ యూజర్లకు తాజాగా 'ఎర్రర్ 53' వస్తుండటంతో వారికి యాపిల్ కంపెనీ క్షమాపణలు చెప్పింది. ఐఫోన్ల హోమ్ బటన్‌లో యాపిల్ 'టచ్ ఐడీ ఫింగర్‌ప్రింట్ రీడర్' ఉంటుంది. పాస్‌వర్డ్ అవసరం లేకుండానే ఫోన్‌ను అన్‌లాక్ చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. అయితే, హోమ్ బటన్లు డ్యామేజ్ అవ్వడం వల్ల ఇటీవల ఐఫోన్, ఐప్యాడ్ లలో వాటిని స్థానిక మెకానిక్‌ల ద్వారా మార్చుకున్న వినియోగదారులకు.. ఆపరేటింగ్ సిస్టం అప్‌డేట్ చేసుకునేటప్పడు.. 'ఎర్రర్ 53' అని వస్తుంది. దీంతో ఐఫోన్ షట్‌డౌన్ అయి.. ఎంతకూ రీస్టార్ట్ కావడం లేదు.
వేలమంది వినియోగదారులు ఈ సమస్య వల్ల ఇబ్బందులు పడుతున్నారు. అయితే యాపిల్ కంపెనీ మాత్రం డివైస్ సెక్యూరిటీ కోసమే ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టామని చెప్పింది. ఈ ఫీచర్ విషయంలో ఎర్రర్ వస్తే యాపిల్ సపోర్ట్‌కు కాల్ చేసి.. సమస్య పరిష్కరించుకోవచ్చునని సలహా ఇచ్చింది. అయితే ప్రస్తుతం ఆ సమస్యను పూర్తిగా పరిష్కరించామని, అప్‌డేటెడ్ వెర్షన్ ఐవోఎస్‌లో ఈ సమస్య తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని యాపిల్ తాజాగా ప్రకటించింది. ఈ సమస్య వల్ల ఇబ్బందిపడిన వినియోగదారులకు క్షమాపణ చెప్పింది.