
14,500 ఏళ్ల క్రితం నాటి పెయింటింగ్స్!
మాడ్రిడ్:పురావస్తు శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించిన పెయింటింగ్స్ కొన్ని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఉత్తర స్పెయిన్లోని ఆక్జర్రా గుహలలో గుర్తించిన ఈ పెయింటింగ్స్ సుమారు 12,000 నుంచి 14,500 ఏళ్ల క్రితం నాటివని తేల్చారు. జంతు చిత్రాలతో కూడిన ఈ పెయింటింగ్స్లో ముఖ్యంగా గుర్రం, అడవి దున్న, మేక, జింక లాంటి జంతువుల చిత్రాలున్నాయి. గుహ గోడలపై చెక్కిన ఈ చిత్రాలను పురావస్తు శాస్త్రవేత్తలు డిగో గరటే, ఇనటి ఇంట్జార్బీలు గుర్తించారు.
రాతి యుగం(పేలియోలిథిక్) కాలం చివరి దశలో ఈ పెయింటింగ్స్ వేసి ఉంటారని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ దశ 40,000 సంవత్సరాల క్రితం నుంచి 10,000 సంవ్సరాల క్రితం వరకు కొనసాగింది. వేల సంవత్సరాల క్రితం రాళ్లతో చెక్కిన పెయింటింగ్స్ కావడంతో ఇప్పుడు కొంత అస్పష్టంగా కనిపిస్తున్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. అయినా ఈ యుగంలోనే మనిషి కళాత్మకంగా కొంత పురోగతి సాధించిన విషయాన్ని ఈ చిత్రాలు స్పష్టం చేస్తున్నాయని శాస్త్రవేత్తలు వివరించారు. ఈ గుహలలోని చిత్రాలపై మరిన్ని పరిశోధనలు నిర్వహిస్తున్నారు.