‘చిప్’లతో కృత్రిమ కిడ్నీలు
అభివృద్ధి చేస్తున్న శాస్త్రవేత్తలు
వాషింగ్టన్: మానవునిలోని మూత్రపిండాల మాదిరిగా పనిచేసే కృత్రిమ కిడ్నీలను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్నారు. సాధారణ కణాలతో తయారు చేసిన ఈ కిడ్నీలు అందులోని మైక్రోచిప్ ఫిల్టర్ల సాయంతో పనిచేస్తాయి. ఇవి చిన్న సైజులో ఉండటం వల్ల శరీరంలో సులువుగా అమర్చవచ్చు. లవణాలు, నీరు, విసర్జితాలను శరీరం నుంచి బయటికి పంపేందుకు ఈ పరికరాన్ని తయారు చేస్తున్నట్లు అమెరికాలోని వాండర్‌బిల్ట్ యూనివర్సిటీకి చెందిన విలియం ఫిస్సెల్ తెలిపారు.
మూత్రపిండాలు పనిచేయడంలో విఫలమైనపుడు ఈ కృత్రిమ పరికరాన్ని అమర్చడం ద్వారా విసర్జితాలను బయటకు పంపొచ్చని చెప్పారు. కృత్రిమ కిడ్నీలో అమర్చిన చిప్‌లలో లవణాలను వడపోసేందుకు సూక్ష్మ రంధ్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రయోగశాలలో కిడ్నీల్లోని కొన్ని కణాలను తీసుకుని మైక్రోచిప్ ఫిల్టర్ల చుట్టూ పెరిగేలా చేసి వీటిని తయారు చేశారు.