ఉగ్ర స్థావరాల అంతమే లక్ష్యం
► జీ 20 దేశాల ఉమ్మడి ప్రకటన..
► హాంబర్గ్‌లో కూటమి సదస్సు ప్రారంభం
హాంబర్గ్: ఉగ్రవాదంపై పోరు, వాతావరణ మార్పులు, స్వేచ్ఛా వాణిజ్య విస్తరణే లక్ష్యంగా జర్మనీలోని హాంబర్గ్‌లో శుక్రవారం జీ20 దేశాల సదస్సు ప్రారంభమైంది. మొత్తం 19 దేశాల అధినేతలతో పాటు యూరోపియన్ యూనియన్ ప్రతినిధులు సదస్సుకు హాజరయ్యారు. జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్ సభ్య దేశాల అధినేతలకు ప్రత్యేక ఆహ్వానం పలికారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ల మధ్య చర్చలు ఈ సదస్సులో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు చేయాలని, అదే సమయంలో ఉగ్రసాయానికి చెక్ పెట్టేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని జీ20 సదస్సు తీర్మానించింది.
శుక్రవారం తొలి రోజు భేటీ అనంతరం జీ20 దేశాలు ఉమ్మడి ప్రకటన విడుదల చేస్తూ.. ప్రపంచంలో ఉగ్రవాదుల సురక్షిత స్థావరాలన్నింటినీ అంతమొందించాలని నిర్ణయించినట్లు అందులో పేర్కొన్నాయి. ‘ఉగ్రవాదుల్ని చట్టం ముందు నిలబెట్టాలి. అందుకోసం భద్రత, ప్రయాణం, వలసలు, ఇంటర్‌పోల్ తదితర విభాగాల్లో ప్రస్తుతమున్న అంతర్జాతీయ సమాచార వ్యవస్థను మెరుగుపర్చాలి. ఉగ్రవాదుల విదేశీ ప్రయాణ ఉద్దేశ్యాన్ని ముందుగానే గుర్తించేలా నిఘా విభాగాలు తమ మధ్య సహకారాన్ని పెంపొందించుకోవాలి. ఉగ్రవాదుల లక్ష్యమేంటి.. వారి గమ్యస్థానం ఏమిటి? అన్న సమాచారం పంచుకోవాలి. ప్రపంచంలో ఉగ్రవాదులకు సురక్షిత స్థావరాలు ఉండకూడదు.
విమానయాన రంగంలో భద్రతా వ్యవస్థలకు పొంచి ఉన్న ముప్పు, ఇతర ప్రమాదాల్ని గుర్తించేందుకు ఒకరికొకరు సహకరించుకోవాలి. ఉగ్రవాదులకు ఆర్థిక సాయం అడ్డుకునేందుకు కట్టుబడి ఉన్నాం. ఉగ్రవాదులకు చేరే నిధులకు అడ్డుకట్ట వేసేలా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో మార్పులు తీసుకురావాలి. ఐసిస్, అల్‌కాయిదా, డాయేష్ తదితర ఉగ్రవాద సంస్థలకు అందుతున్న ఆర్థిక సాయాన్ని అడ్డుకునేందుకు చర్యల్ని బలోపేతం చేయాలి. ఉగ్రసాయం విషయంలో ప్రపంచంలో ఎలాటి సురక్షిత ప్రదేశాలు ఉండకుండా చర్యలు తీసుకోవాలి. ఉగ్రవాదులు తమ లక్ష్యాల కోసం ఇంటర్నెట్, సోషల్ మీడియా వినియోగాన్ని అడ్డుకునేందుకు ప్రైవేట్ రంగంతో కలిసి పనిచేయాల’ని ఉమ్మడి ప్రకటనలో జీ 20 దేశాలు వెల్లడించాయి.
సదస్సు ప్రారంభంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్‌లు కరచాలనంతో ఒకరినొకరు పలకరించుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. అనంతరం ఇరువురు నేతలు ముఖాముఖి చర్చలు జరిపారు. భేటీ అనంతరం ట్రంప్ మాట్లాడుతూ.. ‘పుతిన్, నేను అనేక అంశాలపై సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిపామ’ని పేర్కొన్నారు. జీ20 సదస్సు సందర్భంగా జపాన్, దక్షిణ కొరియా, కెనడా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, వియత్నాం దేశాధినేతలతో మోదీ విడిగా చర్చించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, బ్రిటన్ ప్రధాని మే, జర్మనీ చాన్సలర్ మెర్కెల్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రన్‌తో కొద్దిసేపు ముచ్చటిస్తూ కనిపించారు.
పెట్రో బాంబులతో దాడి
సదస్సుకు వ్యతిరేకంగా హాంబర్గ్‌లో ఆందోళనలు, హింసాఘటనలు జరిగాయి. కొందరు పెట్రోల్ బాంబులతో కార్లకు నిప్పుపెట్టారని.. పరిస్థితిని అదుపులోకి తెచ్చామని పోలీసులు తెలిపారు. ఆందోళనకారులు పలు దుకాణాల అద్దాల్ని పగులకొట్టడంతో పాటు, పోలీసు హెలికాప్టర్ల సమీపంలో మంటలతో కలకలం రేపారు.