భూగోళం చుట్టేసిన బుజ్జాయి!!
పది నెలల వయసుకే ప్రపంచ దేశాలు తిరిగిన పసివాళ్ళ గురించి ఎప్పుడైనా విన్నారా? లండన్ కు చెందిన ఓ చిన్నారి ఇప్పుడు అదే పనిలో ఉంది. పదినెలలకే ప్రారంభించిన ప్రయాణంతో పదహారు నెలలు వచ్చే సరికల్లా భూగోళం చుట్టేసి.. ఇప్పుడు ఆన్‌లైన్‌లో అందర్నీ ఆకట్టుకుటోంది. అతి చిన్న వయసులో ప్రపంచ పర్యాటకురాలిగా పేరు తెచ్చుకుంది.
సాధారణంగా తల్లులంతా తమకు పుట్టిన పిల్లలతో మెటర్నిటీ లీవ్ ను ఇంట్లోనే ఎంజాయ్ చేయాలనుకుంటారు. వారి ఆలనా పాలనా చూసుకుంటూ.. వారి ముద్దు మురిపాలను ఆస్వాదిస్తుంటారు. కానీ ఎడ్వర్డ్స్ దంపతులు అందుకు భిన్నంగా తమ చిన్నారిని తీసుకొని ప్రయాణం ప్రారంభించారు. ఓ బ్యాక్ ప్యాక్ ను తగిలించుకొని ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్, కాంబోడియా, ఇండోనేషియా, థాయిల్యాండ్ వంటి దేశాలన్నీ చుట్టేశారు. దీంతో అడుగులు కూడా వేయడంరాని వయసులో ఆ దంపతుల గారాలపట్టి ఎస్మె.. ఏకంగా 12 దేశాలు తిరిగేసింది. ఇప్పుడు అమ్మానాన్నలతో కలసి దిగిన ఫొటోలతో బ్లాగుల్లోనూ, ఇన్ స్టా గ్రామ్ లోనూ అందర్నీ ఆకట్టుకుంటోంది. లండన్ కు చెందిన 31 ఏళ్ళ కరేన్ ఎడ్వర్డ్స్.. మెటర్నిటీ లీవ్ ను అందరికీ భిన్నంగా వినియోగించుకుంది. తన కూతురు ఎస్మె కు పది నెలలు వచ్చాయోలేదో... ఆమెను భుజాన వేసుకొని భర్త షాన్ బేన్స్ తో కలిసి ప్రపంచ పర్యటన ప్రారంభించింది. చిన్నారికి పదహారు నెలలు వచ్చేసరికి పదిసార్లు విమాన ప్రయాణం చేసింది.
తమ అద్భుత ప్రయాణ అనుభవాలను పొందుపరుస్తూ ఎడ్వర్డ్స్.. తన బ్లాగ్ తో పాటు ఇన్ స్టాగ్రామ్ లోనూ ఫోటోలు పోస్ట్ చేసింది. ఎడ్వర్డ్స్ దంపతులకు ట్రావెలింగ్ అంటే ఇష్టంతోపాటు.. ప్రపంచం మొత్తం పర్యటించాలన్న కోరికా బలంగా ఉంది. కల సాకారం చేసుకునేందుకు ఉన్న కారును అమ్మేశారు. ఇల్లు కూడా అమ్మకానికి పెట్టారు. బేన్స్ తన ఉద్యోగాన్ని వదిలేశాడు. అంతేకాదు తమ ప్రయాణాన్ని ఇప్పట్లో ఆపాలని కూడా వాళ్లు అనుకోవడం లేదు. ఇలా వాళ్లు చేపడుతున్న ప్రయాణాలతో వారి ముద్దుల పట్టి ఎస్మె అతి చిన్న వయసులోనే ప్రపంచ పర్యాటకుల్లో ఒకరిగా స్థానం సంపాదించేసింది.