ఫేస్‌బుక్‌పై ఉక్కు పాదం! | Bangladesh Crackdown On Social Media | Sakshi
Sakshi News home page

బంగ్లాలో సోషల్‌ మీడియాపై ఉక్కు పాదం

Published Tue, Aug 21 2018 4:12 PM | Last Updated on Mon, Oct 22 2018 6:13 PM

Bangladesh Crackdown On Social Media - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : బంగ్లాదేశ్‌లో విద్యార్థుల ఉద్యమాలను ప్రేరేపించిన సోషల్‌ మీడియాపై అక్కడి అవామీ లీగ్‌ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. మొబైల్, ఈమెయిల్, సోషల్‌ మీడియాపై పటిష్టమైన నిఘాను కొనసాగించేందుకు ఇప్పటికే 2.80 కోట్ల డాలర్లతో నిఘా పరికరాలను కొనుగోలు చేసిన ప్రభుత్వం సోషల్‌ మీడియాపై, ముఖ్యంగా ఫేస్‌బుక్‌పై మరింత నిఘాను కొనసాగించేందుకు 1.10 కోట్ల రూపాయలతో మరో ప్రణాళికను రచించింది. సోషల్‌ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చే సమాచారాన్ని ఎప్పటికప్పుడు గుర్తించి, వాటిని అప్‌లోడ్‌ చేసిన వారిని గుర్తించి చట్ట ప్రకారం వారికి శిక్ష విధించేందుకు వీలుగా ‘బంగ్లాదేశ్‌ కంప్యూటర్‌ సెక్యూరిటీ ఇన్సిడెంట్‌ రెస్పాన్స్‌ టీమ్‌’లో మరో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తామని తపాలా, టెలికమ్యూనికేషన్లు, సమాచార సాంకేతిక శాఖ మంత్రి ముస్తఫా జబ్బర్‌ మీడియాకు తెలిపారు. తమకు అన్నింటికన్నా దేశ భద్రతనే ముఖ్యమని ఆయన వ్యాఖ్యానించారు.

గత ఏప్రిల్‌ నెలలో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా, జూన్‌ 29వ తేదీన బస్సు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మరణించిన నేపథ్యంలో రోడ్డు భద్రతా వ్యవస్థను పటిష్టం చేయాలని డిమాండ్‌ చేస్తూ బంగ్లాదేశ్‌ నగరాల్లో ముఖ్యంగా ఢాకా నగరంలో విద్యార్థులు ఉధృతంగా ఉద్యమాలు చేసిన విషయం తెల్సిందే. ఈ రెండు ఉద్యమాల్లో సోషల్‌ మీడియా, ముఖ్యంగా ఫేస్‌బుక్‌ ప్రధాన పాత్ర పోషించింది. రిజర్వేషన్లను ఎత్తివేస్తామంటూ బంగ్లా ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వడంతో మొదటి ఉద్యమాన్ని విద్యార్థులు విరమించారు. రెండోసారి విద్యార్థుల ఉద్యమాన్ని బంగ్లా ప్రభుత్వం అరెస్ట్‌లు, కేసులతో అణచివేసింది. సోషల్‌ మీడియాలో వదంతులను వ్యాప్తి చేస్తున్నారన్న ఆరోపణలపై ఇప్పటి వరకు 97 మందిని అరెస్ట్‌ చేశారు. వారిలో కొంత మందిపై ముందస్తుగా నిర్బంధంలోకి తీసుకునేందుకు వీలు కల్పించే ప్రత్యేక అధికారాల చట్టాన్ని ప్రయోగించింది. ప్రముఖ ఫొటోగ్రఫర్‌ షాహిదుల్‌ ఆలం సహా ముగ్గురు వ్యక్తులపై మాత్రం వివాదాస్పద కమ్యూనికేషన్ల, సమాచార సాంకేతిక పరిజ్ఞాన చట్టంలోని 57 కింద కేసులు నమోదు చేసింది. ఈ చట్టం కింద దోషులకు 14 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది.

అచ్చం ఇలాంటి చట్టాన్నే భారత ప్రభుత్వం తీసుకొచ్చే ప్రయత్నం చేయగా, భారత సుప్రీం కోర్టు అడ్డం పడింది. నకిలీ వార్తలను ప్రచారం చేసినందుకు, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నందుకు, మత విద్వేషాలను రెచ్చగొడుతున్న కారణాలపై ప్రభుత్వం ఈ చట్టాన్ని ప్రయోగిస్తోంది. సోషల్‌ మీడియాపై ఆంక్షలు విధించడం బంగ్లాదేశ్‌లో ఇదే మొదటిసారి కాదు. 2015లో ఫేస్‌బుక్, వాట్సాప్‌లను ప్రభుత్వం  నెల రోజులపాటు నిలిపివేసింది. 2016లో ఫేస్‌బుక్, గూగుల్, మైక్రోసాఫ్ట్‌ అధికారులను పిలిపించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాంటి సమాచారం రాకూడదని హెచ్చరించింది. సోషల్‌ మీడియా వల్ల వ్యక్తిగత గోప్యతకు కూడా ముప్పు వస్తోందని మంత్రి ముస్తఫా ఆందోళన వ్యక్తం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement