కృష్ణ పదార్థం అన్వేషణలో ముందడుగు
లండన్: విశ్వంలో మిస్టరీగా ఉన్న కృష్ణపదార్థం జాడను కనుగొనేందుకు యూనివర్సిటీ ఆఫ్ సౌత్‌ఆంప్టన్ శాస్త్రవేత్తలు ఒక కొత్త సూక్ష్మకణాన్ని ప్రతిపాదించారు. కృష్ణపదార్థం ఉనికిని ఈ ప్రాథమిక చీకటి కణంతో కనిపెట్టవచ్చని పేర్కొన్నారు. నక్షత్రాలు, పాలపుంతలపై ఏర్పడే గురుత్వాకర్షణ బలానికి ఈ చీకటి పదార్థమే కారణమని శాస్త్రవేత్తల భావన.
ఆధారాలు, ప్రయోగాత్మక విధానాల లేమితో ఎవరూ దీన్ని అధ్యయనం చేయలేకున్నారని వివరించారు. ఇతర భార అణువులు, ప్రాథ మిక కణాల కంటే కృష్ణపదార్థం కణాలు ఎక్కువ ద్రవ్యరాశిని కలిగి ఉంటాయని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు.
ఈ కణం ఎలక్ట్రాన్ కంటే తక్కువ ద్రవ్యరాశిని కలిగి ఉండి, కాంతితో సంఘర్షణ జరపనందున కృష్ణపదార్థం కనుగొనేందుకు ఉపకరిస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు. మాక్రోస్కోపిక్ క్వాంటమ్ రెసోనేటర్స్ కన్సార్టియమ్ ఆధ్వర్యంలో కృష్ణపదార్థం జాడ కనుగొనేందుకు శాస్త్రవేత్తలు అంతరిక్ష ప్రయోగాన్ని చేయనున్నారు. ప్రతిపాదిత సూక్ష్మ కణాన్ని కృష్ణపదార్థం గుండా పంపించి దాని మార్గాన్ని పర్యవేక్షించి ఆ కణం స్థానాన్ని అంచనావేసి ఉనికిని కనుగొంటామన్నారు.