బ్యాంకు వద్ద కారుబాంబు దాడిలో 34 మంది మృతి
లష్కర్ గా(అఫ్గానిస్తాన్): పవిత్ర రంజాన్ మాసంలో అఫ్గానిస్తాన్‌లో తాలిబన్లు మరో సారి పేట్రేగిపోయారు. గురువారం లష్కర్ గా పట్ణణంలోని న్యూ కాబూల్ బ్యాంకు ముందు జీతాలు తీసుకునేందుకు బారులు తీరిన ప్రజలపై కారు బాంబుతో దాడికి పాల్ప డటంతో 34 మంది చనిపోయారు. మరో 58 మంది గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను సహాయక బృందాలు ఆసుపత్రులకు తరలించాయి.
అఫ్గానిస్తాన్ పోలీసులు, సైనికులే లక్ష్యంగా దాడికి దిగామని తాలిబన్ ప్రకటించినా బాధితుల్లో అధికులు సాధారణ పౌరులే ఉన్నారని అధికారులు తెలిపారు. రానున్న రంజాన్ పర్వదినం సందర్భంగా జీతాలు తీసుకుందామని ఉదయమే ప్రభుత్వ ఉద్యోగులు, సాధారణ ప్రజలు బ్యాంకు ముందు క్యూ లైన్లలో నిల్చున్నారు. ఇంతలో అటువైపుగా దూసుకొచ్చిన కారు బీభత్సం సృష్టించింది. అసలేం జరుగుతుందో తెలిసే లోగా అందులోని బాంబులు పేలిపోయాయి. ఘటనా స్థలంలో వాతావరణం భీతావహంగా కనిపించింది. పార్కింగ్‌లోని వాహనాలు చెల్లాచెదురయ్యాయి. 2014 నుంచి ఈ బ్యాంకుపై దాడి జరగడం ఇది మూడోసారి.