
సౌదీలో చెస్ గేమ్ నిషేధిస్తూ ఫత్వా
సౌదీ అరేబియాలో చెస్ ఆటను (చదరంగం) నిషేధిస్తూ గ్రాండ్ ముఫ్తీ షేక్ అబ్దుల్ అజీజ్ అల్ షేక్ ఫత్వా జారీ చేశారు.
న్యూఢిల్లీ: సౌదీ అరేబియాలో చెస్ ఆటను (చదరంగం) నిషేధిస్తూ గ్రాండ్ ముఫ్తీ షేక్ అబ్దుల్ అజీజ్ అల్ షేక్ ఫత్వా జారీ చేశారు. ముస్లింల పవిత్ర గ్రంధమైన ఖురాన్ జూదాన్ని నిషేధించిందని, చెస్ కూడా జూదం కిందకే వస్తుందికనక ఈ ఆటను నిషేధిస్తూ ఫత్వా జారీచేయాల్సి వచ్చిందని షేక్ తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. అయితే ఈ ఫత్వా ప్రపంచ చెస్ క్రీడాకారుల్లో కలవరం రేపింది. బ్రిటన్‌కు చెందిన ప్రముఖ చెస్ క్రీడాకారుడు నిగల్ షార్ట్ నాయకత్వంలో అంతర్జాతీయ చెస్ గ్రాండ్ మాస్టర్లందరూ ఫత్వాపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ట్విట్టర్‌లో వ్యంగ్యంగా స్పందించారు.
ముస్లింలకు పవిత్ర నగరమైన మక్కాలో చెస్ ఛాంపియన్‌షిప్ పోటీలు నిర్వహిస్తున్న నేపథ్యంలో సౌదీ అరేబియా యంగ్ నేషనల్ చెస్ అసోసియేషన్‌కు తాము అండగా ఉన్నామని, ఈ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు తమ ప్రోత్సాహం ఉంటుందని నిగల్ షార్ట్ ఓ సందేశంలో తెలిపారు. ఇలాంటి ఫత్వా మొదటిసారి 40 ఏళ్ల క్రితమే తమ దేశంలో జారీ చేశారని, అయినా కచ్చితంగా అమలు ఉద్దేశం తమ ప్రభుత్వానికి లేనందున చెస్ ఛాంపియన్ షిప్ పోటీలు నిరాటంకంగానే కొనసాగుతున్నాయని సౌదీ చెస్ అసోసియేషన్ నాయకుడు ముసాబిన్ థైలీ వ్యాఖ్యానించారు. ఈసారి కూడా తమ పోటీలు సజావుగానే సాగుతాయని ఆశిస్తున్నానని ట్విట్టర్ ద్వారా తెలిపారు. తాజా ఫత్వా నేపథ్యంలో తాను ఎన్నడుకూడా ‘ఫెమినిజం’ లాంటి ఘోరమైన అంశాల జోలికి వెళ్లనని, ఇస్లాం లాంటి అంశాలకే కట్టుబడి ఉంటానని ముసాబిన్ కాస్త వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
ఫత్వాకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికీ తాము ఫత్వాను అమలు చేయాలనే కోరుకుంటున్నారా? అని గ్రాండ్ ముఫ్తీ షేక్‌ను ప్రశ్నించగా, అవునని సమాధానం ఇచ్చారు. చెస్ కాయిన్స్‌ను తమ దేశంలోకి తీసుకరావడం నిషేధమని, చెస్ ఆడటం జూదం కిందకే వస్తుందని, చెస్ ఆడటం వృధా కాలయాపనే కాకుండా ముస్లిం ప్రార్థనలకు అంతరాయం ఏర్పడుతుందని ఆయన చెప్పారు. సౌదీ అరేబియాలో గ్రాండ్ ముఫ్తీ అంటే లీగల్ అధికారాలు గల అత్యున్నత ముస్లిం సంస్థ. దీనికి అధిపతిని సౌదీ రాజే నియమిస్తారు. అధిపతి జారీచేసే ఫత్వాలను ప్రభుత్వం అమలు చేయాల్సి ఉంటుంది. కొన్ని వివాస్పద ఫత్వాలను ప్రభుత్వం అమలు చేయకుండా చూసిచూడనట్లు వదిలేస్తోంది.
సౌదీలో మహిళలు వాహనాలు నడపరాదంటూ గ్రాండ్ ముఫ్తీ ఎప్పుడో ఫత్వా జారీ చేసింది. ఇటీవలి కాలంలో మహిళలు ఈ ఫత్వాను లెక్క చేయడం లేదు. ప్రభుత్వం కూడా చూసి చూడనట్లు వదిలేస్తోంది. కాస్త మతఛాందసవాది అయిన ప్రస్తుత గ్రాండ్ ముఫ్తీ షేక్ అబ్దుల్ అజీజ్ మహిళలపై డ్రైవింగ్ నిషేధాన్ని కచ్చితంగా అమలు చేయాలంటూ ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తున్నారు. 1979లో ఇస్లామిక్ రెవల్యూషన్ తర్వాత ఇరాన్‌లో కూడా చెస్‌ను నిషేధించారు. ప్రజల నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు 1988లో చెస్‌పై నిషేధాన్ని అక్కడి ప్రభుత్వం ఎత్తివేసింది. అయితే చెస్ పేరిట జూదానికి పాల్పడకూడదనే ఆంక్షలు ఇప్పటికీ అమల్లో ఉన్నాయి.
చెస్ గేమ్ ముస్లింల పాలకుల సమయంలో భారత్ నుంచి ముస్లిం దేశాలకు వెళ్లింది. ‘చెక్‌మేట్’ అనే పదం పర్షియన్ పదం ‘షా మట్’ (రాజు చనిపోయాడు) నుంచి వచ్చింది. చెక్‌మేట్‌లో ‘రాజు చచ్చాడు’ అనే అర్థం ఉంది కనకనే సౌదీ అరేబియా చెస్‌ను నిషేధించిందంటూ ట్విట్టర్‌లో కొంతమంది విమర్శకలు కామెంట్ చేశారు.