
సాక్షి: విదేశాలకెళ్లే విమానమెక్కాలంటే పాస్‌పోర్టు, వీసా, టికెట్, తనిఖీలు తదితరాలు తప్పనిసరి. కానీ, ఓ ఏడేళ్ల గడుగ్గాయి ఇవేమీ లేకుండానే విమానమెక్కేసింది. జెనీవా సెంట్రల్ రైల్వేస్టేషన్‌లో ఓ దంపతుల నుంచి బాలిక (7) తప్పిపోయింది. తప్పిపోతే ఎవరైనా ఏడుస్తారు. ఈ చిన్నారి మాత్రం ఓ రైలు పట్టుకుని నేరుగా జెనీవా విమానాశ్రయానికి చేరుకుంది. అక్కడ ఎలాంటి టికెట్ చూపించకుండానే.. తనిఖీలను సులువుగా దాటగలిగింది. చిన్నారి కావడంతో ఎవరూ అంతగా పట్టించుకోలేదు. అలా ప్రయాణికుల్లో కలసిపోయిన చిన్నారి ఎవరికంటా పడకుండా నేరుగా విమానం (ఫ్రాన్స్‌కు వెళ్లాల్సిన) ఎక్కేసింది.
అక్కడ ఒంటరిగా తచ్చాడుతుండటాన్ని గమనించిన భద్రతా సిబ్బంది బాలికను పైలెట్‌కు అప్పగించారు. సీసీ కెమెరాల ద్వారా బాలిక విమానాశ్రయానికి వచ్చిందన్న విషయాన్ని గుర్తించిన తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. అయితే, ఆ విమానం, బాలిక పూర్తి వివరాలను జెనీవా ఎయిర్‌పోర్టు అధికార ప్రతినిధి వెల్లడించలేదు. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు