బీజింగ్ : 12 ఏళ్లుగా బోనులో బందీగా ఉన్న ఓ చింపాంజీకి విముక్తి లభించింది. ఇంకేముంది.. తనదైన రీతిలో పరుగులు తీసింది. తన దారికి అడ్డువచ్చిన వారిని ఎగిరెగిరి తన్నింది. ఇక తనను ఆపేవారే లేరనుకొని పార్క్‌లో పరుగెడుతూ హల్‌చల్ చేసింది. చివరకు మళ్లీ అదే బోనులోకి వెళ్లి బిక్కమొఖం వేసింది. ఈ ఘటన చైనాలోని హెఫీ వైల్డ్‌లైఫ్ పార్క్‌లో గత శుక్రవారం చోటు చేసుకుంది.
హెఫీ వైల్డ్‌లైఫ్ పార్క్‌లో ఓ రేకుల షెడ్డూలో ఉన్న 12 ఏళ్ల యాంగ్ యాంగ్ అనే చింపాంజీ షెడ్డును పగులగొట్టి అక్కడ ఉన్న వెదురు బొంగుల ద్వారా బయటపడింది. అక్కడ నుంచి పరుగులు తీస్తూ జూలో ఉన్న సందర్శకులపై దాడి చేయబోయింది. అడ్డుకున్న జూ సిబ్బందిని ఎగిరితన్నింది. దీంతో కొద్దిసేపు జూలో గందరగోళ వాతావరణం నెలకొంది. తమపై చింపాంజీ ఎటువైపు నుంచి విరుచుకుపడుతుందోనని సందర్శకులు భయంతో వణికిపోయారు. వెంటనే అప్రమత్తమైన జూ సిబ్బంది పోలీసులకు సమాచారాన్ని అందించారు. జూ సిబ్బందితో కలిసి పోలీసులు చాకచక్యంగా యాంగ్ యాంగ్‌ను పట్టుకుని తిరిగి బోనులో పెట్టారు. దీంతో సందర్శకులు ఊపిరిపీల్చుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment