ప్రేమకు ప్రతిరూపం.. చింపూ
పాతికేళ్లయినా మరువని వానరాలు...
మానవత్వం, ప్రేమ, అనురాగాలు మనుషుల్లో ఉండే సహజ గుణాలు. కానీ ఇవి అందరికీ ఉండవు. ఉన్నా.. ఎక్కువ కాలం కొనసాగడం కష్టమే. ఎవరైన మనకు సహాయం చేస్తే వాళ్లను కొంతకాలం గుర్తుంచుకుంటాం. ఎదుటి వ్యక్తులు చేసిన సహాయాన్ని ఏళ్ల తరబడి గుర్తుంచుకోవాలంటే వారు మనల్ని తరచూ కలుస్తూ ఉండాలి. వరుసగా ఓ పదేళ్లు కనబడకుంటే దాదాపు మరచిపోతాం. మానవులను మించి తమకు ప్రేమానురాగాలు ఉన్నాయంటూ నిరూపించాయి ఫ్లోరిడాలోని చింపాంజీలు. ఏకంగా 25 ఏళ్ల తర్వాత తమకు శిక్షణ ఇచ్చిన ట్రెయినీని మాత్రం మర్చిపోలేదు. తల్లిలా పెంచి పోషించిన ఆ శిక్షకురాలిని చూడగానే తమలో ప్రేమానురాగాలను ఆనంద భాష్పాల రూపంలో చూపిస్తూ.. ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నాయి. మూగ సైగలతో తమ ప్రేమను చాటుకున్నాయి.
ప్రయోగాల కోసం...
సాధారణంగా శాస్త్రవేత్తలు మానవులకు వచ్చే పలు రోగాలకు సంబంధించి ఏ ఒక్క మందును కనిపెట్టినా మొదటగా చింపాంజీలపై ప్రయోగిస్తారు. ఇప్పటివరకు కనుగొన్న మందుల్లో 95 శాతం వీటిపై ప్రయోగించినవే. దీనికి కారణం చింపాంజీల డీఎన్‌ఏ 98.8 శాతం మానవుల డీఎన్‌ఏను పోలి ఉండడం. 1974 వచ్చిన హెపటైటిస్ వ్యాధికి పరిశోధకులు మందు కనిపెట్టారు. దీన్ని చింపాంజీలపై ప్రయోగించేందుకు అమెరికాలోని దక్షిణ ఫ్లోరిడాలో ఓ ల్యాబరేటరీని ఏర్పాటు చేశారు. ఇందులో కొన్ని చింపాంజీలను బంధించి వాటికి ఆవాసం కల్పించారు. వీటిపై పరిశోధన చేస్తున్న సమయంలోనే వాటిని బయటి ప్రపంచంలో ఎలా బతకాలో నేర్చించేందుకు కొంత మంది శిక్షకులను నియమించారు. వీరిలో దక్షిణ ఫ్లోరిడాకు చెందిన‘ లిండా కోబనార్’ కూడా ఉన్నారు. అప్పటికే కోబనార్ జంతువుల ప్రవర్తన విభాగంలో డిగ్రీ పూర్తి చేశారు. చింపాంజీలపై పరిశోధనతో పాటు శిక్షణ కూడా ఆరేళ్ల పాటు కొనసాగింది. ఈ సమయంలో కోబనార్ చింపాంజీలను ఎంతో ప్రేమగా చూసేవారు. వాటికి కావాల్సిన అన్ని ఆహార పదార్థాలను సమయానుసారంగా అందించేది. ఆప్యాయతగా వాటికి పాలు పట్టించేది. ఆరేళ్ల అనంతరం హెపటైటిస్‌పై చేసిన ప్రయోగం విజయవంతమవడంతో వాటికి లాబరేటరి నుంచి విముక్తి లభించింది. అనంతరం ఫ్లోరిడాలోని అటవీ ప్రాంతంలో చింపాజీలు ఉండేందుకు ఓ విశాలమైన ఆవాసాన్ని ఏర్పాటు చేశారు.
లూసియానాకు పయనం
చింపాజీలకు శిక్షణ అనంతరం కోబనార్ అక్కడి నుంచి అమెరికాకు దక్షిణాగ్రంలో ఉన్న లూసియానా రాష్ట్రానికి వెళ్లిపోయింది. జంతువులపై తనకు ఉన్న ప్రేమానురాగాలతో అక్కడ కూడా ఓ చింపాంజీ అభయారణ్యం పేరుతో మరికొన్ని చింపాజీలను పెంచింది. అలా నాలుగేళ్లపాటు వాటి ఆలనాపాలనా చూసింది. అనంతరం చింపాజీలపై 1998లో కోబనార్ ఓ చిత్రాన్ని నిర్మించింది. విస్‌డమ్ వరల్డ్ పేరుతో తెరకెక్కించిన ఈ చిత్రంలో సమాజంతో ఎలా మెలగాలి అనే విషయం మానవులు చింపాజీల నుంచి తెలుసుకోవచ్చని తెలియజేశారు. ఈ జంతువులు మనుషుల్లాగానే ప్రేమానురాగాలను పంచుకుంటాయని ఈ చిత్రంలో చూపించారు.
గుర్తున్నానా?
దాదాపు 25 ఏళ్ల అనంతరం కోబనార్ ఫ్లోరిడాలోని చింపాజీల ఆవాసానికి వెళ్లాల్సి వచ్చింది. గతంలో ఆమె శిక్షణ ఇచ్చిన చింపాంజీల్లో కొన్ని అక్కడ ఉన్నాయి. చాలా ఏళ్లు గడవడంతో కోబనార్ వాటిని దూరం నుంచే చూడాలనుకుంది. మీకు నేను గుర్తున్నానా? అంటూ వాటిని పలకరించింది. వెంటనే అక్కడ ఉన్న స్వింగ్ అనే చింపాజీ కోబనార్ వైపుకు దూసుకువచ్చింది. దాని ముఖంలో నవ్వులు విరజిమ్ముతూ కోబనార్ దగ్గరకు వచ్చి ఆమె రెండు చేతులను పట్టుకుంది. నన్ను గుర్తుపట్టావా? అని కోబనార్ మళ్లీ అనడంతో ఒక్క సారిగా తన రెండు చేతులతో ఆమెను కౌగిలించుకొని తన మనసులోని ప్రేమను వెలుబుచ్చింది. కోబనార్ ఎంతో ఆనందంతో ఆ చింపూని బిగ్గరగా ఆలింగనం చేసుకుంది. స్వింగ్ వెనకాలే పరిగెత్తుకుంటూ వచ్చిన ‘డాల్’ అనే మరో చింపాజీ కూడా కౌగిలించుకొని ఆనంద భాష్పాలు కురిపించింది. 25 ఏళ్ల తర్వాత తనను గుర్తు పెట్టుకుని ప్రేమగా కురిపించడంతో కోబనార్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
(25 ఏళ్ల క్రితం ఫోటో)