
బీజింగ్ : భారత్ నుంచి ఔషధ దిగుమతులను పెద్ద ఎత్తున ప్రోత్సహించడంతో పాటు వాటిపై సుంకాలను తగ్గిస్తూ ఆ దేశంతో ఒప్పందానికి వచ్చినట్టు సోమవారం చైనా వెల్లడించింది. అమెరికాతో వాణిజ్య సంబంధాలు క్షీణించిన క్రమంలో భారత్ నుంచి ముఖ్యంగా క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించే మందులను భారీగా దిగుమతి చేసుకోవాలని చైనా నిర్ణయించింది. మరోవైపు భారత్‌తో వాణిజ్య సంబంధాల బలోపేతానికి చర్యలు చేపట్టే క్రమంలో చైనా ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
ఆసియా పసిఫిక్ వాణిజ్య ఒప్పందం (ఏపీటీఏ)కు అనుగుణంగా జులై 1 నుంచి భారత్, చైనాలు పలు ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను తగ్గించాయి. ఈ గ్రూపులో బంగ్లాదేశ్, లావోస్, దక్షిణ కొరియా, శ్రీలంకలు కూడా సభ్యదేశాలుగా ఉన్నాయి. వ్యవసాయ, రసాయన ఉత్పత్తులు సహా 8549 ఉత్పత్తులపై టారిఫ్స్‌ను తగ్గించనున్నామని, భారత్ దాదాపు 3142 ఉత్పత్తులపై దిగమతి సుంకాలను తగ్గించనుందని చైనా స్పష్టం చేసింది.