లంచాల కోసం ప్రత్యేకంగా బ్యాంకు అకౌంట్లు!
చైనాలో అధికారులు తెలివి మీరిపోయారు. లంచాలు తీసుకోడానికి ప్రత్యేకంగా బ్యాంకు అకౌంట్లు ఓపెన్ చేశారు. అయితే అవినీతి నిర్మూలన చర్యలలో భాగంగా చైనా ప్రభుత్వం వాటన్నింటినీ మూసేసి, వేలాది మంది అధికారులను శిక్షించింది. ఆర్థికంగా చాలా బలోపేతమైన గువాంగ్ డాంగ్ రాష్ట్రంలో ఈ తరహా వ్యవహారం సాగింది. బహుమతుల రూపంలో గానీ, గిఫ్టు కార్డుల రూపంలో గానీ, మరే రూపంలోనైనా సరే లంచాలు తీసుకోవద్దని అధికారులకు ప్రొవిన్షియల్ డిసిప్లైన్ ఇన్‌స్పెక్షన్ కమిటీ తెలిపింది.
అయితే చాలా మంది అధికారులు గిఫ్టుకార్డులు తీసుకోవచ్చని భావిస్తున్నారని, అలాగే లంచాల కోసం ప్రత్యేక అకౌంట్లు ఓపెన్ చేవారని.. అలా తీసుకున్న మొత్తాలను ఇచ్చినవాళ్లకే తిరిగి ఇచ్చేయాలని అధికారులు చెప్పారు. చాలా రాష్ట్రాల్లో ఇలా లంచాల అకౌంట్ల మూసివేత కార్యక్రమం కొనసాగుతోంది. 2013 సంవత్సరం నుంచే చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని మొదలుపెట్టారు. అప్పటినుంచి వేలాదిమంది లంచగొండి అధికారులను శిక్షించారు. ఒకవేళ తప్పనిసరిగా లంచం తీసుకోవాల్సి వచ్చినా, ఆ మొత్తాన్ని డిసిప్లైన్ ఇన్‌స్పెక్షన్ కమిటీకి తిరిగి ఇచ్చేయాలని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా కేంద్ర కమిటీ తెలిపింది.