బీజింగ్: అధ్యక్షుడు జిన్‌పింగ్ నిరవధికంగా అధికారంలో కొనసాగేలా అనుమతించే ప్రతిపాదనపై చైనాలో వ్యతిరేకత మొదలైంది. అధికార కమ్యూనిస్ట్ పార్టీ(సీపీసీ) నిర్ణయాన్ని శాసనకర్తలు తిరస్కరించాలని కోరుతూ సోమవారం ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, పాత్రికేయులు లీ డతోంగ్, మహిళా వ్యాపారవేత్త వాంగ్ ఇంగ్ బహిరంగ లేఖలు రాశారు.
వారి వ్యాఖ్యలు స్థానిక మెసేజింగ్ యాప్ వీచాట్‌లో విస్తృతంగా వ్యాపించాయి. చైనా అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు రెండు సార్లే పదవి చేపట్టాలంటున్న ప్రస్తుత నిబంధనలను రద్దుచేస్తూ రాజ్యాంగ సవరణ చేయాలని అధికార పార్టీ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఇది అమల్లోకి వస్తే జిన్‌పింగ్ తన జీవిత కాలమంతా అధికారంలో కొనసాగే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. ఇలా అయితే, చైనా మళ్లీ రాచరిక పాలనలోకి వెళ్లిపోతుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
తిరోగమన పయనం..
ఈ పరిణామాలపై లీ డతోంగ్ స్పందిస్తూ... అధ్యక్షుడి పదవీ కాల పరిమితులను ఎత్తేస్తే దేశంలో అస్థిరత ఏర్పడుతుందని అన్నారు. దేశాధినేత పదవికి నిర్దిష్ట కాల పరిమితి లేనట్లయితే, తాము మళ్లీ రాచరిక యుగంలోకి వెళ్తున్నట్లేనన్నారు. ప్రభుత్వ సంస్కరణలకు గట్టి మద్దతుదారైన వాంగ్ ఇంగ్ తన లేఖలో.. ‘మా తరం అంతా మావో పాలనలోనే గడిచిపోయింది.
అది గతం. మళ్లీ ఎలా అటు వైపు వెళ్తాం? అధికార పార్టీ ప్రతిపాదన పూర్తిగా వంచనాపూరితం. మెజారిటీ ప్రజల అభిప్రాయలకు విరుద్ధం’ అని పేర్కొన్నారు. చైనా రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడు ఐదేళ్ల చొప్పున రెండు పర్యాయాలకు మించి అధికారంలో కొనసాగకూడదు. ఆధునిక యుగంలో చైనా స్వాభావిక సామ్యవాద వ్యవస్థ పరిరక్షణకే ఈ ప్రతిపాదన చేసినట్లు విదేశాంగ మంత్రి లూ కాంగ్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment