బీజింగ్: ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్నైనా కాపీ కొట్టడం, ప్లాస్టిక్ వస్తువుల నుంచి ఎలక్ట్రానిక్ వస్తువుల వరకు ప్రపంచ మార్కెట్‌లోకి చౌకగా విడుదల చేయడం చైనా పారిశ్రామిక సంస్కృతిగా ఇంతకాలం ప్రపంచ దేశాలు భావిస్తూ వచ్చాయి. వాస్తవానికి ఇప్పుడు ఈ సీన్ మారుతోంది. సొంతంగా సృజనాత్మక ఆలోచనలతో కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం, అందుకు పేటెంట్లను రిజిస్టర్ చేసుకోవడం చైనాలో ఇప్పుడు ఎక్కువైంది. చైనాలోని శెన్‌జెన్ నగరంలో పేటెంట్ హక్కుల కోసం దాఖలవుతున్న దరఖాస్తులే అందుకు తార్కాణం.
అన్ని రంగాల్లో ఆర్థికాభివృద్ధి సాధిస్తున్న చైనా, సాంకేతిక రంగంలో ప్రపంచ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న సిలికాన్ వ్యాలీని అధిగమించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. వ్యవస్థీకృత మూలధనం (వెంచర్ క్యాపిటల్) పెట్టుబడులతోపాటు ఫిన్‌టెక్, ఫార్మ రంగాల్లో కూడా దూసుకుపోతోంది. ఇంతకాలం పెట్టుబడుల ప్రాతిపదికన వ్యాపారాన్ని నిర్వహించిన చైనా ఇప్పుడు తన పంథాను మార్చుకొని వినియోగం ప్రాతిపదికన వ్యాపార పురోభివృద్ధికి కృషి చేస్తోంది.
వెంచర్ క్యాపిటల్ పెట్టుబడుల్లో చైనా 2009 సంవత్సరంలో 0.9 అమెరికా బిలియన్ డాలర్ల పెట్టుబడుల్లో ప్రపంచంలో రెండో స్థానంలో నిలవగా 2014 సంవత్సరం నాటికి తమ పెట్టుబడులను ఏకంగా7.7 బిలియన్ డాలర్లకు పెంచుకొంది. వెంచర్ పెట్టుబడుల్లో ప్రపంచంలో ఇప్పటికీ చైనాది రెండో స్థానమే అయినప్పటికీ పెట్టుబడుల పెరుగుదలను పరిగణలోకి తీసుకుంటే అమెరికాను రానున్న కాలంలో అధిగమించే అవకాశం కనిపిస్తోంది. అమెరికా వెంచర్ క్యాపిటల్ పెట్టుబడుల్లో 2009లో 8.8 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో ప్రపంచంలో అగ్రస్థానాన్ని ఆక్రమించగా, 2014లో 24.8 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో అగ్రస్థానాన్ని నిలుపుకొంది. అమెరికా పెట్టుబడులు అప్పటికిప్పటికీ మూడింతలు పెరగ్గా, చైనా పెట్టుబడులు దాదాపు ఏడింతలు పెరిగాయి. ఆర్థిక సాంకేతిక రంగమైన ఫిన్‌టెక్‌లో కూడా అమెరికాలోని కాలిఫోర్నియా తర్వాత చైనానే రెండో స్థానంలో కొనసాగుతోంది.
సృజనాత్మక రంగంలో చైనా వేగంగా ముందుకు దూసుకెళ్లడానికి చైనా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, ప్రణాళికలే దోహదపడుతున్నాయి. చైనా ప్రభుత్వం స్థానిక మౌళిక సౌకర్యాలకు ప్రాధాన్యత ఇవ్వడంతోపాటు పారిశ్రామిక రంగానికి ఎన్నో ప్రోత్సహకాలు ఇస్తున్నాయి. కొత్త కంపెనీలకు రెండేళ్లపాటు నూటికి నూరు శాతం పన్నులను వెనక్కి చెల్లించడం లాంటి చర్యలు తీసుకొంటోంది. పారిశ్రామిక, సాంకేతిక రంగాలకు దోహదపడే అనేక పరిశోధనా కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది.
దేశంలోని అన్ని యూనివర్శిటీల్లో లైఫ్ సెన్సైస్ గ్రాడ్యువేట్లను ప్రోత్సహిస్తోంది. అలాగే విదేశీ యూనివర్శిటీల్లో చదువుతున్న విద్యార్థులను దేశానికి రప్పించేందుకు ప్రోత్సహకాలు ఇస్తోంది. పాశ్చాత్య యూనివర్శిటీలో గ్రాడ్యువేషన్ పూర్తి చేసుకున్న చైనా విద్యార్థులు ఏటా దాదాపు 80 వేల మంది మాతృ దేశానికి తరలివెళ్లి వివిధ రంగాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు.