బీజింగ్ : చావు ఎదురుగా ఉన్నప్పుడు దాని నుంచి తప్పించుకోవాలని తపనపడే మనిషికి.. ఎంతకైనా తెగించాలనే ధైర్యం కూడా ఖచ్ఛితంగా వస్తుంది. తాజాగా చైనాలో ఓ వ్యక్తి అగ్ని కీలల నుంచి తప్పించుకునే క్రమంలో చేసిన సాహసం వైరల్ అవుతోంది.
యాహూ న్యూస్ కథనం ప్రకారం.. డిసెంబర్ 13వ తేదీన చోంగ్‌క్వింగ్ నగరంలోని ఓ బహుళాంతస్థుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో తన ప్రాణాలను కాపాడుకునేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు. ప్రమాదం జరిగిన అంతస్థు నుంచి బయటపడేందుకు యత్నించాడు. ఈ క్రమంలో 23వ అంతస్థు నుంచి కిందికి వేలాడాడు. తన ఎదురుగా ఉన్న అద‍్దాలు పగలకొట్టి, ఆ ఫ్లోర్‌లోకి దూకేందుకు తీవ్రంగా యత్నించాడు.
పై నుంచి అగ్ని కీలలు పడుతున్నా అతను పట్టు విడవలేదు. దూరం నుంచి ఈ ఘటనను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా అది వైరల్ అయ్యింది. అయితే చివరకు అతను బతికాడా? లేదా? అన్న దానిపై సస్పెన్స్ కొనసాగగా.. హుటాహుటిన అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది అద్దాలను పగల కొట్టి అతన్ని లోపలికి లాగి రక్షించినట్లు తెలుస్తోంది. చిన్న చిన్న గాయాలతో అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.
ప్రాణం కోసం పోరాటం.. బతికాడా? లేదా?
Comments
Please login to add a commentAdd a comment