
డ్రంక్ అండ్ డ్రైవ్ తప్పించుకోవడం కోసం ఫ్లై ఓవర్ మీద నుంచి దూకేసిన ప్రయాణికుడు
బీజింగ్ : డ్రంక్ అండ్ డ్రైవ్‌ని తప్పించుకోవడానికి మందుబాబులు నానా తంటాలు పడుతుంటారు. పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారని తెలిస్తే చాలు తప్పించుకోవడానికి మార్గాలు ఆలోచిస్తారు. ఆ దారిని తప్పించి, రాంగ్ రూట్‌లోనైనా సరే పోలీసులకు చిక్కకుండా వెళ్లి పోవాలనుకుంటారు. చైనాకు చెందిన ఓ ప్రయాణికుడు కూడా ఇదే పని చేశాడు. కానీ ఓ కాలు విరగ్గొట్టుకుని, ఆస్పత్రి పాలయ్యాడు. తీరా అక్కడ వైద్యులు అతన్ని పరీక్షిస్తే అతని రక్తంలో ఆల్కహాల్ కంటెంట్ జీరో అని తెలిసింది. ఈ ఫన్ని సంఘటన చైనాలోని జియాంగ్జు పట్టణంలో చోటు చేసుకుంది.
పట్టణంలోని ఒక ఫ్లై ఓవర్ మీద పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. అదే మార్గంలో వస్తున్న సదరు ప్రయాణికుడు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికిపోతానని భావించి వెనకా ముందు ఆలోచించకుండా ఫ్లై ఓవర్ మీద నుంచి దూకేశాడు. ఈ సంఘటనలో సదరు ప్రయాణికుడి కాలు విరిగిపోయింది. డ్రంక్ అండ్ డ్రైవ్‌కు భయపడి వంతెన మీద నుంచి దూకాడంటే ఎంత తాగాడో అని అనుకుంటే పొరపాటు పడినట్లే. ఎందుకంటే ఆ ప్రయాణికుడు డ్రంక్ అండ్ డ్రైవ్ జరిగిన రోజున కాకుండా దానికి ముందు రోజు రాత్రి మద్యం తీసుకున్నాడు. అయినా కూడా అతి తెలివితో పోలీసులకు దొరుకుతానేమోనని భయపడి ఆవేశంలో ఫ్లై ఓవర్ మీద నుంచి దూకి ఆస్పత్రి పాలవ్వడమే కాక ఓ కాలు పోగొట్టుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment