పరీక్ష హాల్లో తలతిప్పారో.. డైరెక్ట్ జైలుకే
బీజింగ్: ఎట్టకేలకు చైనా ఓ భారీ మార్పుకు స్వీకారం చుట్టింది. తమ దేశంలో జరుగుతున్న పరీక్షల్లో మోసాలకు పాల్పడుతున్న విద్యార్థులను కట్టడి చేసేందుకు కఠిన చర్యలు తీసుకుంది. గత ఏడేళ్లుగా ఈ అంశంపై సుదీర్ఘ పరిశీలనలు జరిపిన చైనా చివరకు పోలీసులకు చెందిన ప్రత్యేక టీంల కనుసన్నల్లో పరీక్షలు జరపాలని నిర్ణయించింది. కాలేజీల్లో, యూనివర్సిటీల్లో ఉన్నత చదువులకోసం మరో వారం రోజుల్లో జరిగే పరీక్షలకు స్వాట్(ఎస్డబ్ల్యూఏటీ) అనే పోలీసు టీంలను పరీక్షల నిర్వహణకోసం రంగంలోకి దించింది.
పరీక్ష పేపర్లు కూడా ఈ టీమే అందించనుంది. ఒక్కో పరీక్ష కేంద్రానికి ఎనిమిదిమంది ప్రత్యేక పోలీసు అదికారులను కూడా నియమిస్తుంది. పరీక్ష పేపర్లు ఇచ్చిన అనంతరం ఈ స్వాట్ టీం ప్రతి విద్యార్థిని సీసీటీవీ కెమెరా ద్వారా చాలా జాగ్రత్తగా పరిశీలిస్తుంది. ఎవరైన అనుమానాస్పద కదలికలకు పాల్పడినా.. కాపీయింగ్కు దిగినా వారిని వెంటనే అరెస్టు చేసి జైలుకు తరలిస్తారు. ఇటీవల కూడా తొమ్మిదిమంది నకిలీ పరీక్ష పత్రాలను వీధుల్లో అమ్ముతూ పట్టుబడటంతో చైనా తాజాగా ఈ చర్యలకు ఉపక్రమించింది.