చైనాలో హాలీవుడ్ చిత్రాల హవా
బీజింగ్: హాలీవుడ్ సినిమా మార్కెట్‌లో అమెరికాకన్నా చైనానే ముందుకు దూసుకెళుతోంది. చైనా కొత్త సంవత్సరం సందర్భంగా ఫిబ్రవరి ఏడవ తేదీ నుంచి 14వ తేదీ వరకు చైనాలో టిక్కెట్ల అమ్మకం ద్వారా ఏకంగా 3,820 కోట్ల రూపాయలను హాలీవుడ్ సినిమాలు కొల్లగొట్టాయి. కేవలం పది సినిమాల ద్వారానే ఇంతటి వసూళ్లు వచ్చాయంటే హాలీవుడ్ సినిమాల మార్కెట్ చైనాలో ఎంతగా విస్తరిస్తుందో అర్థం చేసుకోవచ్చు. 2005 నుంచి 2015 నాటికి హాలీవుడ్ సినిమాలకు చైనా మార్కెట్ 30 శాతం పెరిగిందని చైనా డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్నారు.
ఫిబ్రవరి 7 నుంచి 14 వరకు వసూలైన కలెక్షన్లను విశ్లేషిస్తే హాలివుడ్ కామెడీ చిత్రం ‘మెర్మేడ్’ అన్నింటికన్నా ముందున్నది. ఈ సినిమా 1910 కోట్ల రూపాయలను వసూలు చేసింది. తర్వాత స్థానాల్లో మాన్‌స్టర్ హంట్, ఫ్యూరియస్, ట్రాన్స్‌ఫార్మర్స్:ఏజ్ ఆఫ్ ఎక్సిటింక్షన్, మోజిన్: ది లాస్ట్ లెజెండ్, లాస్ట్ ఇన్ హాంకాంగ్, అవెంజర్స్:ఏజ్ ఆఫ్ అల్ట్రాన్, గుడ్‌బై మిస్టర్ లాసర్, జురాసిక్ వరల్డ్, అవతార్ సినిమాలు ఉన్నాయి. అమెరికాలో అత్యంత ప్రేక్షకాదరణ పొందిన ‘స్టార్‌వార్స్:ది ఫోర్స్ అవేకన్స్’ చిత్రం ఈ జాబితాలోకి రాకపోవడం గమనార్హం.
చైనాలో హాలీవుడ్ సినిమాల హవా పెరుగుతుండడంతో చైనాకు చెందిన నటీనటులను ఎక్కువగా తీసుకునేందుకు హాలీవుడ్ నిర్మాతలు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే ఎంతో మంది నటీ నటులు పలు ప్రాజెక్టులకు సంతకాలు చేశారు. అలాగే హాలీవుడ్ సినిమాల్లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు చైనా నిర్మాతలు కూడా ముందుకొస్తున్నారు. హాలీవుడ్ సినిమాల్లో 1740 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు చైనాకు చెందిన ‘పర్‌ఫెక్ట్ వరల్డ్ పిక్చర్స్’ నిర్మాణ సంస్థ అమెరికాకు చెందిన ‘యూనివర్సల్ స్టూడియో’తో ఫిబ్రవరి 19వ తేదీన ఒప్పందం కుదుర్చుకుంది. చైనా ప్రేక్షకులు ఆదరించిన మొట్టమొదటి హాలీవుడ్ సినిమా హారిసన్ ఫోర్డ్, టామ్మీ లీ జోన్స్ నటించిన ‘ది ఫుజిటివ్’ చిత్రం. ఈ చిత్రం 1993లో విడుదలైంది.