
బీజింగ్ : ప్రతిదీ కూర్చున్న చోటకే రావాలని ఆలోచించే రోజులు ఇవి. అలానే తినే తిండి కూడా అనుకున్న వెంటనే రావాలనుకుంటున్నాం. ఫలితంగా ఎన్నో ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు, యాప్‌లు పుట్టుకొచ్చాయి. ఒక్కసారి ఆయా యాప్‌లోకెళ్లి నచ్చిన ఆహారాన్ని బుక్ చేసుకుంటే నిమిషాల్లో కోరుకున్న ఆహారం మనం ఉన్న చోటకే వస్తోంది. ఈ ఫుడ్ డెలివరీ యాప్‌ల పుణ్యమాని డెలివరీ బాయ్ ఉద్యోగాలు కూడా బాగానే పెరిగాయి. అయితే ఓ డెలివరీ బాయ్ చేసిన నిర్వాకం వల్ల ఆన్‌లైన్‌లో ఆహారం బుక్ చేసుకుందామనుకునే వారు కాస్తా భయపడుతున్నారు.
చైనాలోని గువాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లో జరిగిన ఈ సంఘటన వివరాలు.. ని సిహుయి నగరంలోని ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ మైచువన్‌కు చెందిన డెలివరీ బాయ్.. కస్టమర్లకు అందించాల్సిన ఆహారాన్ని తానే సగం తినేసి తర్వాత దాన్ని మళ్లీ మామూలుగా ప్యాక్ చేసి డెలివరీ ఇవ్వడానికి తీసుకెళ్లాడు. డెలివరీ బాయ్ లిఫ్ట్‌లో వెళ్తున్నప్పుడు ఈ పని చేశాడు.
సదరు డెలివరీ బాయ్ ఆహారం ఉన్న బాక్సును తెరిచి అందులోనే నోరు పెట్టి మరీ సగం ఆహారాన్ని తినేశాడు. తర్వాత ఏమి జరగనట్టుగా మూత పెట్టేసి కవర్‌లో ప్యాక్ చేసేశాడు. అంతటితో ఊరుకోక ఇంకో బాక్సులో ఉన్న సూప్ కూడా అలాగే తెరిచి కొంచెం తాగి మళ్లీ మూత పెట్టి కవర్‌లో పెట్టాడు. అనంతరం పార్సిల్ కవర్‌ను డెలివరీ చేసి, వెళ్లిపోయాడు. అయితే ఈ మొత్తం సంఘటనంతా లిఫ్ట్‌లో జరగడంతో అక్కడ ఉన్న సీసీ కెమరాల్లో రికార్డయ్యింది.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో సదరు కంపెనీ అతడిని ఉద్యోగంలో నుంచి తొలగించింది. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ వీడియోను ఇప్పటికే దాదాపు రెండు లక్షల మందికి పైగా వీక్షించారు. ఈ వీడియోకి వేలాది షేర్లు, వందలాది కామెంట్లు వస్తున్నాయి. గతంలో కూడా డెలివరీ బాయ్స్ ఇలాంటి పనులు చేసిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment