సీపెక్ ప్రాజెక్టులో భాగంగా గస్తీ కాస్తున్న పాక్ బలగాలు (ఫైల్ ఫొటో)
ఇస్లామాబాద్ : చైనా, పాకిస్థాన్‌లు బరితెగించాయి. యుద్ధంలో ఓడిపోయి దొరికిపోయిన సైనికులను బానిసలుగా మార్చుకొని వెట్టి చాకిరీ చేయించుకునే రోజులు మనం చరిత్రలో చూశాం. ఇప్పటికీ పలు పుస్తకాల్లో అలాంటి అంశాలను చదివి ఆశ్చర్యపోతాం. కానీ, ఇప్పటికీ అదే పోకడను చైనా అనుసరిస్తుందంటే నమ్ముతారా..! కానీ, తప్పనిసరిగా నమ్మితీరాల్సిందే. అయితే, ఇప్పుడు వారు పనిచేయించుకొంటున్న ఖైదీలు ఏ దేశంపైనో యుద్ధానికి వెళితే ఓడిపోయి చైనాకు లొంగిపోయిన వారు కాదు.. చిన్నచిన్న దొంగతనాలు, దోపిడీలు, హత్య నేరాలు, తదితరమైన నేరాల్లో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఎన్ని వివాదాలు చుట్టుముట్టినా మొండిపట్టుతో చైనా ఇప్పుడు అతిపెద్ద ప్రాజెక్టును తలపెట్టిన విషయం తెలిసిందే. భారత సరిహద్దును సైతం తడుముతూ చైనా పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ (సీపెక్) పేరిట పెద్ద ప్రాజెక్టును చైనా నిర్మిస్తోంది. అయితే, ఈ ప్రాజెక్టు నిర్మాణానికి చైనా తమ దేశంలో జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలను ఉపయోగిస్తుందట. ఈ విషయాన్ని స్వయంగా పాకిస్థాన్‌కు చెందిన ఓ ఎంపీ స్పష్టం చేశారు.
పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ)కి చెందిన జాతీయ అసెంబ్లీ సభ్యుడు నవాబ్ మహ్మద్ యూసఫ్ తాల్పుర్ ఇటీవల జరిగిన పార్లమెంటరీ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ 'చైనా జైళ్లలో నుంచి ఖైదీలను పట్టుకొచ్చి సీపెక్ ప్రాజెక్టులో భాగంగా రోడ్లు, భవనాలు, వంతెనలు నిర్మించేందుకు ఉపయోగించుకుంటున్నట్లు నా దృష్టికి వచ్చింది. ఇలా చేసే సమయంలో అప్పటికే నేరగాళ్లయిన వాళ్లు మరోసారి నేరాలకు పాల్పడే ప్రమాదం ఉంది. కచ్చితంగా భద్రతా ఏర్పాట్లు చేయాలి' అని అన్నారు. నేరస్తులతో పనిచేయించుకునే విషయంలో బహుశా రెండు దేశాల మధ్య రహస్య ఒప్పందం జరిగి ఉండొచ్చని, ఎందుకంటే సహజంగా ఒక దేశం నుంచి మరో దేశానికి సరైన అనుమతులు ప్రొసీజర్ ఫాలో అవకుండా నేరస్థులను పంపిచకూడదని ఆయన చెప్పారు. ఒక వేళ ఇలాంటి రహస్యాలు బయటకు చెప్పకూడదనుకున్నప్పుడు చట్టసభ సభ్యులమైన తమకు వివరించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment