
పోలీసు వాహనంపైకి ఎక్కిన చైనా కార్మికుడు
ఇస్లామాబాద్ : అభివృద్ధి ప్రాజెక్టులపై చైనా, పాకిస్తాన్ కలిసి పనిచేస్తున్న క్రమంలో పలు ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. పాకిస్తాన్‌లో నిర్మాణ పనుల్లో నిమగ్నమైన చైనా కార్మికులపై పాకిస్తాన్ పోలీసులు ప్రతాపం చూపుతున్నారు. చైనా కార్మికులు, ఇంజనీరింగ్ సిబ్బందిని సెక్యూరిటీ కవర్ లేకుండా బయటకు అనుమతించకపోవడంపై వారు భగ్గుమంటున్నారు. అయితే చైనా కార్మికుల రక్షణ కోసం ఏర్పాటు చేసిన స్ధానిక పోలీసులపైనే చైనా కార్మికులు చేయి చేసుకుంటున్నారని పాక్ పత్రిక డాన్ పేర్కొంది. రెడ్ లైట్ ఏరియాలోకి వారిని అనుమతించనందునే చైనా కార్మికులు పోలీసులపై దాడులు చేశారని తెలిపింది.
భహవల్పూర్-ఫైసలాబాద్ హైవే నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతంలో జరిగిన ఈ ఘటన కలకం రేపింది. చైనా ఇంజనీర్లు, కార్మికులను భద్రతా వలయం లేకుండా పాక్ పోలీసులు అనుమతించడం లేదని, ఇందుకు చైనా సిబ్బంది నిరాకరించడంతో వారిని బయటకు వెళ్లకుండా పోలీసులు నిలువరించారని స్ధానిక మీడియా పేర్కొంది. పోలీసులపై చైనా కార్మికులు దాడులకు తెగబడ్డారని, పోలీసుల కార్లపైనే పలువురు నిలబడ్డారని అధికారులు ఆరోపించారు.
]మరోవైపు పాక్ పోలీసుల తీరుపై చైనా కార్మికులు మండిపడుతున్నారు. తమపై స్ధానిక పోలీసులు దౌర్జన్యాలకు దిగుతున్నారని నిర్మాణ పనులను నిలిపివేసి ఆందోళనలకు దిగారు. ఈ ఘటనపై పాకిస్తాన్, చైనా ఇప్పటివరకూ అధికారికంగా స్పందించలేదు.
Comments
Please login to add a commentAdd a comment