న్యూఢిల్లీ : పాక్ ఆక్రమిత కశ్మీర్ గుండా చైనా నిర్మిస్తున్న చైనా- పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్(సీపీఈసీ) వద్ద చైనా ఇంజనీర్లకు, పాకిస్తాన్ పోలీసులకు మధ్య ఘర్షణ తలెత్తింది. పంజాబ్ ప్రావిన్స్‌లోని ఖనేవాల్ వద్ద జరిగిన ఈ గొడవలో చైనీయులు పాక్ పోలీసులను కొట్టేందుకు ప్రయత్నిస్తుండగా, వారు పారిపోతున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. సీపీఈసీ పరిధిలోని ‘ఎమ్4 మోటార్‌వే’ నిర్మాణం వద్ద చైనా ఇంజనీర్లు విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో క్యాంప్ వదిలి వెళ్లిపోవాల్సిందిగా వారిని పాక్ పోలీసులు బెదిరింపులకు గురిచేశారనే కారణంగా పోలీసులకు చైనీయులకు మధ్య చిన్నపాటి వాదన తలెత్తింది. ఇది చినికి చినికి గాలివానగా మారి ఘర్షణకు దారితీసింది.
పాకిస్తాన్‌కు చెందిన డాన్ న్యూస్ గొడవకు సంబంధించిన వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మరో ప్రైవేట్ వీడియోలో చైనా ఇంజనీర్ ఒకరు పోలీసు వ్యాను పైకెక్కి డోర్ తెరిచేందుకు ప్రయత్నిస్తుండగా.. అతడి నుంచి తప్పించుకునేందుకు పోలీసు లోపలి వైపు నుంచి డోర్ లాక్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అంతటితో ఆగకుండా.. గొడవ ముగిసిన తర్వాత పాక్ పోలీసుల క్యాంప్‌కు కరెంటు సరఫరా నిలిపివేసినట్లు పాక్ మీడియా పేర్కొంది. కాగా ఈ ఘటనపై విచారణ చేపట్టామని.. ఈ గొడవకు పూర్తి బాధ్యత చైనా ఇంజనీర్‌దే అని పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. పరిస్థితులను అదుపులోకి తీసుకువచ్చేందుకు పోలీసులు ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయిందని పేర్కొన్నారు. గొడవకు కారణమైన ఐదుగురు చైనీయులను వెళ్లిపోవాల్సిందిగా పంజాబ్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
Comments
Please login to add a commentAdd a comment