తాజా సర్వేలో ట్రంప్ మరింత వెనక్కి
వాషింగ్టన్: రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్కు ఆదరణ రోజురోజుకూ తగ్గిపోతోంది. పాక్స్ న్యూస్ నిర్వహించిన తాజా సర్వే ఫలితాల్లో ఈ విషయం వెల్లడైంది. ట్రంప్ ప్రత్యర్థి, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కు ఓటర్ల ఆదరణ పెరిగిందని జాతీయస్థాయిలో నిర్వహించిన సర్వేలో తేలింది.
సెప్టెంబర్ 11 నుంచి 14 తేదీల మధ్య ఫాక్స్ న్యూస్ నిర్వహించిన సర్వేలో ట్రంప్ కంటే హిల్లరీ.. కేవలం ఒక పాయింట్ శాతం ఓటర్ల మెజారిటీ కలిగి ఉన్నారని వెల్లడికాగా.. తాజా సర్వే ఫలితాల్లో మాత్రం హిల్లరీ ఆధిక్యం మూడు పాయింట్ల శాతానికి పెరిగింది. ట్రంప్‌కు 40 శాతం ఓటర్లు మద్దతు ఇవ్వగా.. హిల్లరీకి 43 శాతం ఓటర్ల మద్దతు ఉందని తాజా సర్వేలో వెల్లడైంది. మొదటి డిబేట్లో మహిళలపై ట్రంప్ దృక్పథం సరిగా లేదంటూ హిల్లరీ ఎండగట్టిన విషయం తెలిసిందే. ఈ డిబేట్ అనంతరం ట్రంప్కు జనాదరణ తగ్గినట్లు తెలుస్తోంది. రాండమ్ శాంపిల్ విధానంలో దేశ వ్యాప్తంగా 10,000 మందికి పైగా రిజిష్టర్డ్ ఓటర్ల అభిప్రాయాలతో ఈ సర్వేను నిర్వహించినట్లు ఫాక్స్ న్యూస్ వెల్లడించింది.