హింస వల్లే తండ్రి, నానమ్మలను కోల్పోయా!
-
నోట్ల రద్దు ఏకపక్ష నిర్ణయం
-
వారసత్వ రాజకీయాలు తప్పట్లేదు
-
మోదీ మంచి వక్త.. కానీ...
-
అందుకే ఎన్నికల్లో ఓడిపోయాం
-
బర్క్‌లీ యూనివర్సిటీలో రాహుల్‌గాంధీ
సాక్షి, వాషింగ్టన్: భారత్ తప్ప మరేయితర ప్రజాస్వామిక దేశం అత్యధిక జనాభాను పేదిరికం నుంచి బయట పడేలేకపోయిందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. అమెరికా బర్క్‌లీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో మంగళవారం ఉదయం ఆయన ప్రసంగించారు. భారత్‌లో సమకాలీన పరిస్థితులపై ఆయన ఉపన్యసించారు.
దేశ ప్రజలను ఐక్యం నిలిపింది ఒక్క అహింస మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. అయితే మానవత్వాన్ని ముందుకు తీసుకెళ్లే ఆ అహింసపైనే ఇప్పుడు కొందరు దాడులు చేస్తున్నారని ఆయన అన్నారు. కోపం, హింస వినాశనానికి దారితీస్తుందన్న రాహుల్ రాజకీయ వైషమ్యాలు పతనం వైపు నడిపిస్తాయని చెప్పారు. 1984 అల్లర్ల అంశాన్ని ఉటంకిస్తూ... న్యాయం కోసం పోరాడే వారికి తాను మద్ధతుగా ఉంటానని, హింసను ఖండిస్తానని ఆయన పేర్కొన్నారు. తన తండ్రి రాజీవ్ గాంధీ, నానమ్మ ఇందిరాగాంధీలను హింసే బలితీసుకున్నాయని.. ఆ బాధ ఎలా ఉంటుందో తనకే తెలసని ఆయన వ్యాఖ్యానించారు.
వామపక్ష, వామపక్ష రహిత(లెఫ్ట్ ఆర్ రైట్) దేశాల్లో దేని వైపు భారత్ ఉంటుందన్న ప్రశ్నకు .. తాము ముక్కుసూటిగా(స్ట్రెయిట్) గా ఉంటామని ఇందిర చెప్పేవారని ఈ సందర్భంగా రాహుల్ ప్రస్తావించారు. ప్రజాస్వామిక వాతావరణంలో అత్యధిక ఉద్యోగాల కల్పన చేపడుతున్న దేశాలు చైనా, భారత్ మాత్రమేనని రాహుల్ అన్నారు. అయితే ఆర్థిక సలహాదారుల, చట్ట సభలను సంప్రదించకుండా డీమానిటైజేషన్ లాంటి నిర్ణయం తీసుకోవటం ఆర్థికంగా నష్టాన్ని కలిగిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.
సంప్రదింపుల ద్వారానే కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు తీసుకుంటుందే తప్ప బలవంతంగా ప్రజలపై తమ అభిప్రాయాలను రుద్దబోదని స్పష్టం చేశారు. 2012 సమయంలో పార్టీలో కొందరు నేతల మధ్య అహంకారం పెరిగిపోవటం మూలంగానే ఓటమి పాలయ్యామని ఆయన అన్నారు. కీలక బాధ్యతలు స్వీకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్న రాహుల్.. అది మెజార్టీ కార్యకర్తల అభిప్రాయం.. పార్టీ అధిష్టానం నిర్వహించే ఎన్నికలు.. ఇలా ఓ క్రమపద్ధతి ఉంటుందని చెప్పారు.
ప్రస్తుతం ప్రజాస్వామిక పరిస్థితులు కాస్త భిన్నంగా తయారయ్యాయని.. వారసత్వ పాలన పరిస్థితులే కనిపిస్తున్నాయని అఖిలేష్ యాదవ్, స్టాలిన్, చివరకు సినిమాల్లో అభిషేక్ బచ్చన్. వ్యాపార రంగంలో అంబానీ తనయుడు ఇలా పలువురి పేర్లను చెప్పుకొచ్చారు. రాజకీయంగా తనపై వస్తున్న సెటైర్లపై ఓ ప్రశ్నకు రాహుల్ బదులిస్తూ.. వెయ్యి మందితో కూడిన ఓ బీజేపీ యాంత్రంగం కంప్యూటర్ల ముందు కూర్చుని తనను తిడుతున్నారని, దేశాన్ని నడిపించే ఓ పెద్దాయన వారిని ముందుండి నడిపిస్తున్నారని చెప్పారు.
తొమిదేళ్ల పాటు మన్మోహన్, చిదంబరం, జైరామ్ రమేశ్ లాంటి రాజకీయ వేత్తలతో తాను జమ్ము కశ్మీర్ వ్యవహారంపై పని చేశానని, తమ పార్టీ అధికారంలో ఉన్నంతకాలం ఉగ్ర వాదం జాడలు లేకుండా పోయిందని... కశ్మీర్ లో శాంతి కూడా నెలకొందని రాహుల్ అన్నారు. ముఖ్యంగా మన్మోహన్ హయాంలో 2013 లో ఉగ్రవాద నడ్డివిరిచిన సమయంలో తాను సంతోషంతో మన్మోహన్ సింగ్‌ను హత్తుకుని మనం సాధించిన అతిపెద్ద విజయం ఇదేనని చెప్పానని రాహుల్ గుర్తు చేశారు.
కశ్మీర్ అధికార పార్టీ పీడీపీ యువతను రాజకీయాల్లోకి తీసుకొచ్చి మంచి పని చేసిందని.. కానీ, ఎప్పుడైతే బీజేపీతో చేతులు కలిపిందో.. అప్పుడే మోదీ పీడీపీని సర్వనాశనం చేశారని రాహుల్ అన్నారు. మోదీ హయాంలోనే కశ్మీర్ లో మళ్లీ ఉగ్రవాదులు చెలరేగిన పోతున్నారని.. హింస కూడా చెలరేగి పరిస్థితి అల్లకల్లోలంగా మారిందని పేర్కొన్నారు. అయితే మోదీ ఓ మంచి వక్త అన్న రాహుల్.. ఒక జనసందోహంలో ఉన్న మూడు నాలుగు గ్రూపులకు సముదాయించేలా మాట్లాడటం ఒక్క మోదీకే చెల్లతుందని చెప్పారు. కానీ, పార్టీలో తనతో పాటు పని చేసే సభ్యులతో మాత్రం ఆయన(మోదీ) సంబంధం లేనట్లు ఉంటారని.. ఈ విషయం బీజేపీ పార్టీకి చెందిన కొందరు నేతలు తనతో చెప్పారని అన్నారు. సమాచార హక్కు చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తమ గుప్పిట్లో పెట్టుకోవటం మూలంగా ప్రభుత్వ లోపాలను, అవినీతిని సమాజానికి తెలియజేయాలన్న కాంగ్రెస్ పార్టీ ప్రయత్నానికి ఆటంకంగా మారిందని రాహుల్ గాంధీ తెలిపారు.