గుండెపోటును నియంత్రించవచ్చు!
పరిశోధకుల్లో భారత సంతతి వ్యక్తి
టొరంటో: సాధారణ ఔషధాలతో గుండెపోటును నియంత్రించవచ్చని పరిశోధకులు గుర్తించారు. శాటిన్స్ (కొలెస్ట్రాల్ తగ్గించేవి), యాంటీహైపర్‌టెన్సివ్ (బీపీని తగ్గించే) ఔషధాలు వాడితే గుండెపోటు బారిన పడకుండా ఉండొచ్చని చెప్పారు. శాటిన్స్, యాంటీహైపర్‌టెన్సివ్ మందుల్లో ఏదో ఒకటి వాడినా, లేదా రెండు మందులను వాడినా గుండెపోటును నియంత్రించవచ్చన్నారు. పరిశోధకుల్లో భారత సంతతికి చెందిన వ్యక్తి ఉండటం విశేషం.
కెనడాలోని హామిల్టన్ హెల్త్ సెన్సైస్, మెక్‌మాస్టర్ యూనివర్సిటీ పాపులేషన్ హెల్త్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన పరిశోధకులు 21 దేశాలకు చెందిన 12వేలకు మందికిపైగా రోగులను అధ్యయనం చేసి ఈ విషయం చెప్పారు. ఏటా ప్రపంచవ్యాప్తంగా గుండెపోటుతో 1.8 కోట్ల మంది మరణిస్తుండగా, 5 కోట్ల మంది గుండెపోటు బారిన పడుతున్నారు. ఏటా 10 శాతం మంది గుండెపోటు బారిన పడుతుండగా, 20 నుంచి 30 శాతం మంది ఈ ఔషధాలతో ప్రయోజనం పొందుతున్నారన్నారు.