
ప్రతీకాత్మక చిత్రం
న్యూయార్క్: కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా మృత్యుఘంటికలు మోగిస్తోంది. కోవిడ్-19 బారిన పడిన బాధితుల సంఖ్య మంగళవారం నాటికి 8 లక్షలు దాటేసింది. అమెరికాలో ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసులు లక్షన్నర దాటిపోగా, తాజాగా ఇటలీలో లక్ష దాటాయి. కరోనా సోకి మృతి చెందిన వారి సంఖ్య 39 వేలు దాటింది. ఇప్పటివరకు అంతర్జాతీయంగా 39,563 మరణాలు నమోదయ్యాయి. (కరోనా: నెమ్మదిగా కోలుకుంటున్న ఇటలీ!)
జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ తాజా గణాంకాల ప్రకారం.. అమెరికాలో 165,482 మంది కోవిడ్ బారిన పడగా 3,186 మరణాలు సంభవించాయి. తాజాగా 45 మంది మృత్యువాత పడ్డారు. ఇటలీలో 101,739 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, అత్యధికంగా 11,591 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే కొత్తగా మరణాలు నమోదుకాకపోవడం ఇటాలియన్లకు ఊరట కలిగిస్తోంది.
స్పెయిన్‌లో కరోనా విలయం
మరో యూరోపియన్ దేశం స్పెయిన్‌లో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. కోవిడ్ బారిన పడుతున్నవారు, ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య వేగంగా పెరుగుతుండటం తీవ్ర భయాందోళన కలిగిస్తోంది. 94,417 మందికి కరోనా సోకగా, 8,269 మంది చనిపోయారు. కొత్తగా 553 మరణాలు నమోదు కావడం స్పెయిన్ వాసులను వణికిస్తోంది. బ్రిటన్‌లోనూ తాజాగా 381 మరణాలు సంభవించడంతో యూరప్ దేశాలు భీతిల్లుతున్నాయి. బ్రిటన్‌లో 25,150 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1,789 మంది మృతి చెందారు. (వెయ్యి మందిని కోల్పోయాం: న్యూయార్క్ గవర్నర్)
Comments
Please login to add a commentAdd a comment