దాదాపు ప్రపంచ దేశాలన్నీ కోవిడ్ మహమ్మారితో వణికిపోతున్నాయి. ముఖ్యంగా యూరప్ దేశాలైన ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీల్లో కేసులు, మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నాయి. చాలా దేశాలు లాక్‌డౌన్ విధించడంతోపాటు ఇతర దేశాలతో తమకున్న సరిహద్దులను మూసివేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆసియా దేశమైన దక్షిణ కొరియా మాత్రం ఎలాంటి లాక్‌డౌన్‌లు లేకుండానే విజయవంతంగా కోవిడ్19 మహమ్మారిని తమ దేశంలో నిరోధించింది. ఫిబ్రవరి 29న దక్షిణ కొరియాలో అత్యధికంగా 909 కేసులు నమోదు కాగా, మార్చి 17 నాటికి ఇది 74 కేసులకు తగ్గింది. ఈ నేపథ్యంలో ఆ దేశం అనుసరించిన విధానాల వైపు ప్రపంచ దేశాలన్నీ చూస్తున్నాయి. ఇంతకీ దక్షిణ కొరియా కోవిడ్‌ను ఎలా కట్టడి చేసిందంటే..
మెర్స్ నుంచి పాఠాలు
2015లో దక్షిణ కొరియాకు చెందిన ఒక వ్యాపారవేత్త విదేశాల్లో పర్యటించి వచ్చాక మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (మెర్స్) బారినపడ్డాడు. 186 మందికి ఈ వ్యాధి సోకడానికి కారణమయ్యాడు. వీరిలో 36 మంది మరణించారు. అతడు మూడు ఆస్పత్రుల్లో చికిత్స పొందాడు. ఈ నేపథ్యంలో అతడు చికిత్స పొందిన ఆస్పత్రుల సిబ్బంది, రోగులు, సందర్శకులతో సహా మొత్తం 17 వేల మందిని గుర్తించి.. వారిని పరీక్షించి రెండు నెలలపాటు వారిని దక్షిణ కొరియా సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉంచింది. ఇలా మెర్స్‌ను ఆ దేశం విజయవంతంగా తిప్పికొట్టింది.(కరోనాను అడ్డుకునే సామర్థ్యం భారత్ సొంతం)
అంటువ్యాధిని నియంత్రించాలంటే ప్రయోగశాలఅవసరమని ఆ దేశం నాడే గ్రహించింది. నాడు మెర్స్ నుంచి నేర్చుకున్న పాఠాలే ఇప్పుడు కోవిడ్‌ను నిర్మూలించడంలో దక్షిణ కొరియాకు ఉపయోగపడ్డాయి.
ఇందుకోసం అత్యంత విస్తృతమైన,వ్యవస్థీకృత చర్యలను చేపట్టింది. కోవిడ్ సోకినవారిని గుర్తించి వారిని ఇతరుల నుంచి వేరు చేయడం, బాధితుల పరిచయస్తులను గుర్తించడం.. వారిని నిర్బంధించడం ఇలా మూడు రకాల చర్యలు తీసుకుంది. మొత్తం 2,70,000 మందికి పరీక్షలు నిర్వహించింది.
చైనాలో కరోనా వైరస్ వెలుగు చూసిన తర్వాత వెంటనే అప్రమత్తమైంది కొరియా ప్రభుత్వం. కొరియా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (కేసీడీసీ) వెంటనే రంగంలోకి దిగి మెడికల్ కిట్స్ తయారీపై సన్నద్ధత పెంపొందించుకుంది. అంతేకాకుండా వైద్య పరికరాల ఉత్పత్తి సంస్థలకు కూడా సహకారం అందించింది. ఫిబ్రవరి 7న తొలి మెడికల్ కిట్‌ను విజయవంతంగా పరీక్షించి చూసుకుంది. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే అన్ని మెడికల్ కిట్లు దేశంలోని మారుమూల ప్రాంతాలకు చేరిపోయాయి.
ఫిబ్రవరి 18న దక్షిణ కొరియాలో తొలి కోవిడ్ కేసు వెలుగు చూసింది. దక్షిణ కొరియా రాజధాని సియోల్‌కు 240 కి.మీ. దూరంలో డేగు అనే చోట ప్రార్థన కోసం చర్చికి వెళ్లిన 61 ఏళ్ల మహిళకు కరోనా సోకింది. ఆ చర్చిలో ఆమెతోపాటు 500 మంది ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఫిబ్రవరి 29 నాటికి దక్షిణ కొరియాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,150కు పెరిగింది. దీంతో ఆ తేదీ నాటికి చైనా తర్వాత అత్యధిక కరోనా కేసులు వెలుగు చూసిన దేశంగా దక్షిణ కొరియా నిలిచింది. అయితే మరణాల సంఖ్యను కేవలం 75కు మాత్రమే పరిమితం చేయగలిగింది. (కోవిడ్‌పై రంగంలోకి ఐబీ!)
Comments
Please login to add a commentAdd a comment