
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారిపై పోరాటానికి బీజింగ్‌కు చెందిన ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు (ఏఐఐబీ) భారతదేశానికి మరోసారి భారీ నిధులు ప్రకటించింది. 750 మిలియన్ డాలర్ల (సుమారు 5,714 కోట్ల రూపాయల) రుణాన్ని ఆమోదించినట్లు బుధవారం తెలిపింది. కోవిడ్-19 కారణంగా ఇబ్బందులు పడుతున్న పేద, బలహీనవర్గాల సంక్షేమానికి ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి ఇది సహాయపడుతుందని ప్రకటించింది. కరోనా, లాక్‌డౌన్ కారణంగా ఆర్థిక కార్యకలాపాలు స్థంభించి పోవడంతో పేదలు కష్టాల్లో కూరుకుపోయారని, ముఖ్యంగా అనధికారిక రంగంలో పనిచేస్తున్న మహిళలు ఇందులో ఉన్నారని ఏఐఐబీ తెలిపింది. (మా వ్యాక్సిన్ ఏడాది పాటు కాపాడుతుంది)
దేశంలో వైరస్‌ను కట్టడి చేయడంతో పాటు, ఆర్థికంగా అత్యంత వెనుకబడిన పేద ప్రజల సహాయ కార్యక్రమాల కోసం భారత ప్రభుత్వం వీటిని ఖర్చు పెట్టనుంది. ఆసియా అభివృద్ధి బ్యాంకుతో సమన్వయంతో అనధికారిక రంగానికి సహా వ్యాపారాలకు ఆర్థిక సహాయాన్ని పెంచడం, అవసరమైనవారికి సామాజిక భద్రత విస్తరించడం, దేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలను బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ మొత్తాన్ని అందిస్తున్నట్టు ఒక ప్రకటనలో తెలిపింది.
ప్రపంచంలో తక్కువ, మధ్య-ఆదాయ దేశాలు వైరస్ ప్రభావానికి సంబంధించి ప్రారంభ దశలోనే ఉన్నప్పటికీ మహమ్మారి ప్రభావానిక గురయ్యారని ఏఐఐబీ తెలిపింది. భారతదేశంలోని లక్షలాది మంది పేదలు అపారమైన ప్రమాదంలోకి నెట్టివేయబడతారని ఏఐఐబీ ఉపాధ్యక్షుడు (ఇన్వెస్ట్మెంట్ ఆపరేషన్స్) పాండియన్ వ్యాఖ్యానించారు. దేశ ఆర్థిక వ్యవస్థకు మానవ మూలధనంతో సహా ఉత్పాదక సామర్ధ్యంలో దీర్ఘకాలిక నష్ట నివారణ,ఆర్థిక స్థితిస్థాపకత నిర్ధారించడం కూడా అవసరమన్నారు. ఇందుకు భారతదేశానికి మద్దతు అందిస్తున్నట్టు పాండియన్ తెలిపారు. ప్రపంచ బ్యాంకు ప్రకారం, 270 మిలియన్ల మంది ప్రజలు జాతీయ దారిద్య్రరేఖకు దిగువన నివసిస్తున్నారనీ, జనాభాలో 81 మిలియన్ల మంది పరిమిత ఆరోగ్య సేవలతో నివసిస్తున్నారని పేర్కొంది. కాగా ఇప్పటికే కోవిడ్-19 అత్యవసర సహాయంగా ఇండియాకు 500 మిలియన్ డాలర్లను ప్రకటించింది.