
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా శాఖాహార ప్రచారం పెరిగిపోవడంతో జంతుజాలానికి చెందిన ఆవు పాలకు కూడా దూరంగా ఉండాలంటూ శుద్ధ శాకాహారుల ఉద్యమం ఇంగ్లండ్‌తోపాటు భారత్‌లోనూ ఊపందుకుంది. బాదం, ఓట్స్, సోయా తదితర మొక్కల మూలాల నుంచి వచ్చే పాలను రోజూ తాగినట్లయితే సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండవచ్చనే ప్రచారం కొనసాగుతోంది. దాంతో పలు కార్పొరేట్ కంపెనీలు కూడా అందమైన బాటిళ్లలో ప్లాంట్ బేస్డ్ పాలను సరఫరా చేస్తున్నాయి.
అయితే ఇవేవి కూడా ఆవు పాలంత శ్రేష్టమైనవి కావని కేమ్‌బ్రిడ్జ్ యూనివర్శిటీలో బయో మెడికల్ సైన్స్‌లో పీహెచ్‌డీ చేసిన డాక్టర్ అలెక్సీస్ విల్లెట్ తన పరిశోధనల సాక్షిగా తెలిపారు. ఆవు పాలకు, గింజల నుంచి తీసే పాలకు విటమిన్స్, ప్రోటీన్స్ విషయంలో ఎంతో తేడా కూడా ఉందని ఆయన చెప్పారు. గింజల నుంచి తీసిన పాలలో కేవలం రెండున్నర శాతమే గింజ పదార్థం ఉంటుందని, మిగతా అంతా ఒట్టి నీళ్లేనని ఆయన చెప్పారు. శాకాహార పాలుగా పేర్కొనే వీటిలో ఆవు పాలకన్నా కొలస్ట్రాల్ తక్కువ, కొవ్వు ఎక్కువే ఉన్నప్పటికీ ప్రొటీన్లు కూడా బాగా తక్కువని ఆయన తేల్చి చెప్పారు. మొక్కల్లో కాల్షియం, విటిమిన్ బీ ఉన్నమాట వాస్తవమేగానీ అది తక్కువ స్థాయిలో ఉంటుందని, వాటిని శరీరం ఇముడ్చుకోవడం కూడా కష్టమేనని డాక్టర్ విల్లేట్ చెప్పారు. బాదం, బీన్స్‌లలో కాల్షియం 20–25 శాతం ఉంటే, ఆవు పాలలో 30 శాతం కాల్షియం ఉంటుందని, పైగా అది సులభంగా రక్తంతో కలుస్తుందని చెప్పారు. ఆవు పాలలో అదనంగా డీ విటమిన్ కూడా ఉంటుందని ఆయన చెప్పారు. మొత్తంగా తక్కువ ఆవు పాలలో ఎక్కువ పోషకాలు, ఎక్కువ శాకాహార పాలల్లో తక్కువ పోషకాలు ఉంటాయని, ఏ విధంగా చూసిన ఆవు పాలే అన్ని విధాల శ్రేష్టమైనవని ఇటీవల రాసిన ఓ సైన్స్ వ్యాసంలో ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment