
దావూద్ ఇబ్రహీం అన్నకొడుకు అరెస్టు
మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది దావూద్ ఇబ్రహీం అన్నకొడుకు సోహైల్ కస్కర్ (36)ను అమెరికా పోలీసులు అరెస్టు చేశారు.
మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది దావూద్ ఇబ్రహీం అన్నకొడుకు సోహైల్ కస్కర్ (36)ను అమెరికా పోలీసులు అరెస్టు చేశారు. నార్కో టెర్రరిజానికి పాల్పడుతూ కుట్రలు పన్నుతున్నాడన్న ఆరోపణలతో అతడిని అరెస్టు చేశారు. విదేశీ ఉగ్రవాద సంస్థకు సామగ్రి సరఫరా చేయడం, మిసైల్ లాంచింగ్ సిస్టంలను అక్రమంగా అమ్మడం లాంటి నేరాలు కూడా అతడిపై ఉన్నాయి. కొలంబియాకు చెందిన ఉగ్రవాద సంస్థతో సోహైల్‌కు సంబంధాలు ఉన్నట్లు చెబుతున్నారు. అమెరికాలోని డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అడ్మినిస్ట్రేషన్ (డీఈఏ) సంస్థ అతడితో పాటు మరో ఇద్దరు పాకిస్థానీయులను 2015 డిసెంబర్ నెలలో అరెస్టు చేసింది.
స్పెయిన్ నుంచి అతడిని నేరగాళ్ల అప్పగింత ఒప్పందం కింద రప్పించారు. కానీ దావూద్, అతడి మనుషులు ఈ విషయం ఇప్పటివరకు బయటపడకుండా తొక్కిపెట్టారు. ఇది బయటపడితే తమ పరువు ఎక్కడ పోతుందోనని వాళ్లిలా చేశారు. దావూద్ చిన్న తమ్ముడు నూరా పెద్దకొడుకే ఈ సోహైల్. నూరా గతంలోనే మరణించాడు. సోహైల్‌ను విడిపించేందుకు దావూద్ ఇబ్రహీం ఓ పెద్దస్థాయి లాయర్‌ను నియమించాడు. కానీ ఒకవేళ అతడిమీద నేరం రుజువైతే మాత్రం దాదాపు 25 ఏళ్ల పాటు జైల్లోనే ఉండాల్సి వస్తుంది.