
మరణించినా... సంపాదనలో టాప్!
లాస్ ఏంజెలెస్: మైకేల్ జాక్సన్... బతికుండగా ఎంతోమందిని ఉర్రూతలూగించిన ఆటగాడు, పాటగాడు. మళ్లీ ఆయన ఇప్పుడెందుకు గుర్తొచ్చాడంటే... చనిపోయినా అత్యధికంగా సంపాదిస్తున్న సెలబ్రిటీల్లో మన మైకేల్ అగ్రస్థానంలో నిలిచాడు. ప్రఖ్యాత ఫోర్బ్స్ పత్రిక ‘టాప్ ఎర్నింగ్ డెడ్ సెలబ్రిటీ’ పేరుతో నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. వరుసగా నాలుగో ఏడాది కూడా జాక్సనే టాపర్‌గా నిలిచినట్లు ఫోర్బ్స్ ప్రకటించింది. 825 మిలియన్ డాలర్ల ఆదాయంతో మైకేల్ మొదటిస్థానంలో నిలవగా ఈ ఏడాది మరణించిన సంగీత విద్వాంసుడు డేవిడ్ బోవీ తర్వాతి స్థానంలో నిలిచాడు.
జాక్సన్ ఎస్టేట్‌ను విక్రయించడం ద్వారా 750 మిలియన్ డాలర్ల ఆదాయం రాగా, మిగతా సొమ్ము ఆయన మ్యూజిక్ ఆల్బమ్ హక్కులను సొంతం చేసుకున్న సోనీ, ఏటీవీ సంస్థల ద్వారా వచ్చాయని ఫోర్బ్స్ తెలిపింది. ఆదాయపన్ను, ఇతర న్యాయ ఖర్చుల చెల్లింపునకు ముందే జాక్సన్ ఆదాయాన్ని లెక్కగట్టామని, వీటన్నింటిని మినహాయిస్తే దివంగత పాప్ సింగర్ ఆదాయం కొంతమేర తగ్గవచ్చని, అయినప్పటికీ మిగతా వారితో పోలిస్తే జాక్సన్ చాలా ముందున్నారని ఫోర్బ్స్ తెలిపింది.