వాషింగ్టన్: కోవిడ్ టీకా ఈ ఏడాది చివరికల్లా సిద్ధమవుతుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. కరోనా వైరస్ చికిత్సకు రెమిడెస్‌విర్‌ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు తమ ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు. ఫాక్స్ న్యూస్ చానల్ నిర్వహించిన టౌన్‌హాల్ కార్యక్రమంలో ఆయన చానల్ సోషల్ మీడియా ద్వారా అందిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఈ ఏడాది చివరికల్లా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందనే అనుకుంటున్నానని చెప్పారు. ఆరోగ్య శాఖ అధికారులు టీకా తయారీకి ఏడాది నుంచి ఏడాదిన్నర సమయం పడుతుందని ప్రకటించినప్పటికీ గత నెలలో వైట్‌హౌస్ టాస్క్‌ఫోర్స్ సభ్యుడు డాక్టర్ ఆంథొనీ ఫాసీ టీకా త్వరగా అందుబాటులోకి వస్తుందని చెప్పిన సంగతి తెలిసిందే.
12 టీకాలు మానవ ప్రయోగాలకు సిద్ధం
కరోనా వైరస్ నుంచి రక్షణ కల్పించే టీకాను అభివృద్ధి చేసేందుకు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వంద వరకూ ప్రయోగాలు జరుగుతున్నాయి. వీటిల్లో అమెరికా, చైనా, బ్రిటన్, జర్మనీల్లో కనీసం పన్నెండు టీకాలు మానవ ప్రయోగాలకు సిద్ధంగా ఉన్నాయి. ‘శాస్త్రవేత్తల బృందాలు ఒకరితో ఒకరు పోటీ పడటం లేదు. వైరస్‌ను మట్టుబెట్టేందుకు పోటీపడుతున్నాం. ఈ క్రమంలో మరింత మంది ప్రయోగాలు చేయడం అవసరం కూడా’’అని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో టీకా తయారీకి జరుగుతున్నప్రయత్నాలకు నేతృత్వం వహిస్తున్న డాక్టర్ ఆండ్రూ పోలార్డ్ తెలిపారు.
చైనాలో ఈ ఏడాది మార్చిలో ప్రయోగాత్మక టీకా ఒకదాన్ని కొంతమందిపై ప్రయోగించి సత్ఫలితాలు రాబట్టారు. ప్రస్తుతం అదే టీకాను విస్తృత స్థాయిలో ప్రయోగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. జర్మనీలో ప్రఖ్యాత ఫార్మా కంపెనీ ఫైజర్, బయోఎన్‌టెక్ అనే సంస్థలు కలిసికట్టుగా గత వారమే 4 వేర్వేరు టీకాలను మానవులపై ప్రయోగించి పరీక్షిస్తున్నాయి. జూలైలోపు మరిన్ని ప్రయోగాత్మక టీకాలపై వివిధ దేశాలు మానవ ప్రయోగాలు నిర్వహించనున్నాయి. కరోనా వైరస్‌లోని ఓ భాగాన్ని రోగ నిరోధక వ్యవస్థ స్వయంగా గుర్తించి మట్టుబెట్టేలా చేసేందుకు మరికొందరు ప్రయత్నాలు చేస్తున్నారు.
చైనాలో మరోసారి కరోనా!
చైనాలో కరోనా వైరస్ మరోసారి తిరగబెడుతోందా? అవునని హెచ్చరిస్తున్నారు చైనా ఆరోగ్యశాఖ అధికారులు. దేశంలోని పది ప్రావిన్సుల్లో స్థానికంగా వ్యాప్తి చెందిన కరోనాకేసులు కొన్ని బయటపడ్డాయని జాతీయ ఆరోగ్య కమిషన్ అధికార ప్రతినిధి పెంగ్ చెప్పారు. తాజాగా వైరస్ బారిన పడ్డవారిలో లక్షణాలేవీ కనిపించడం లేదని, దీన్నిబట్టి చైనాలో కరోనా ప్రమాదం ఇంకా పొంచి ఉందనే అనుకోవాలన్నారు. చైనాలో పలు కార్యాలయాలు, వ్యాపారాలు పనిచేస్తున్నప్పటికీ సినిమా థియేటర్లను మూసే ఉంచారు. ఆదివారం చైనాలో విదేశాల నుంచి తిరిగి వచ్చిన ముగ్గురిలో కోవిడ్ లక్షణాలు కనిపించినట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. మొత్తం 952 మంది కోవిడ్ బాధితులు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment