
92 ఏళ్ల బామ్మను వేధిస్తున్న డోనాల్డ్ ట్రంప్
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ల అభ్యర్థిగా పోటీ చేస్తున్న డోనాల్డ్ ట్రంప్ చీకటి కోణాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. స్కాట్‌లాండ్‌లోని తన లగ్జరీ గోల్ఫ్ కోర్టును విస్తరించడం కోసం ట్రంప్ 92 ఏళ్ల ఓ స్కాటిష్ బామ్మను, ఆమె కుమారుడిని గత నాలుగేళ్లుగా వేధిస్తున్నారు. తాగేందుకు నీళ్లు లేకుండా చేయడమే కాకుండా కంటి మీద కునుకు లేకుండా కూడా చేస్తున్నారు.
డోలాల్డ్ ట్రంప్‌కు స్కాట్‌లాండ్లోని అబర్డీన్‌షైర్‌లో 600 హెక్టార్లలో లగ్జరీ గోల్ఫ్ కోర్టు ఉంది. దీన్ని 2012లో ప్రారంభించారు. ఆ తర్వాత దీన్ని మరింత విస్తరించాలనుకున్నారు. దీనికి ఆనుకొని 92 ఏళ్ల మోలీ ఫోర్బ్స్ ఇల్లుంది. అందులో ఆమె తన కుమారుడు మైఖేల్ ఫోర్బ్స్‌తో కలసి నివసిస్తోంది. ఎంతోకొంత నష్టపరిహారం చెల్లిస్తామని, ఇల్లు, వాకిలి వదిలేసి వెళ్లాల్సిందిగా ట్రంప్ మనుషులు బెదిరిస్తూ వచ్చారు. అయినా మోలీ ఫోర్బ్స్ ఆయన బెదిరింపలకు భయపడలేదు. చచ్చినా సరే ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయే ప్రసక్తే లేదని ఆమె స్పష్టం చేశారు.
దీంతో ఆగ్రహించిన ట్రంప్ మనుషులు గోల్ఫ్ కోర్టు నుంచి ఆమె ఇంటికి వెళుతున్న మంచినీళ్ల పైపులైన్‌ను ధ్వంసం చేశారు. దాంతో ఫోర్బ్స్ ఇంటికి మంచినీటి సరఫరా నిలిచిపోయింది. స్థానిక ప్రభుత్వ అధికారులకు ఆమె ఫిర్యాదు చేశారు. ట్రంప్ మనుషులు దాన్ని ధ్వంసం చేసినందున ట్రంప్‌యే దాన్ని మరమ్మతు చేయాలని స్థానిక అధికారులు నోటీసు ఇచ్చి ఊరుకున్నారు. మరమ్మతు చేయడానికి ట్రంప్ ససేమిరా అన్నారు. చేసేదేమీలేక మోలీ ఫోర్బ్స్ దూరానున్న ఏటి వద్దకెళ్లి గత నాలుగేళ్లుగా అవసరమైన నీళ్లు తెచ్చుకుంటున్నారు. ఇళ్లు ఖాళీచేయించడానికి ఆమెపై మరింత ఒత్తిడి తీసుకరావడం కోసం ఆమె ఇంటిముందు గోల్ప్ కోర్టు సరిహద్దులో భారీ గోడను నిర్మించారు. ఆమె బెడ్‌రూమ్‌కు ఎదురుగా ఫ్లడ్ లైట్ ఏర్పాటు చేశారు.
ఫ్లడ్‌లైట్ వెళుతురుకు తనకేరోజు సరిగ్గా నిద్ర పట్టడంలేదని, అయినా సరే వారి ఒత్తిళ్లకు లొంగే ప్రసక్తే లేదని, తన బొందిలో ప్రాణం ఉన్నంతవరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తానని మోలీ ఫోర్బ్స్ ‘యూ హావ్ బీన్ ట్రంప్డ్ టూ’ అనే డాక్యుమెంటరీ చిత్రంలో వెల్లడించారు. ఆమె పోరాటానికి ఆమె కుమారుడు మైఖేల్ ఫోర్బ్స్ కూడా మద్దతిస్తున్నారు. ట్రంప్ మనషులు పొద్దస్తమానం తన ఇంటిముందుకు వచ్చి రకారకాలుగా తిట్టి పోతుంటారని, వారి తిట్లను పట్టించుకోవడం మానేశానని ఆమె చెప్పారు. స్కాట్‌ల్యాండ్‌లో 90 శాతం ప్రజలు ట్రంప్‌కు వ్యతిరేకమని మైఖేల్ ఫోర్బ్స్ తెలిపారు. ట్రంప్‌ను దేశాధ్యక్షుడిగా ఎన్నికుంటే అది అమెరికన్ల దౌర్భాగ్యం అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు.
‘యూ హావ్ బీన్ ట్రంప్డ్ టూ’ అనే డాక్యుమెంటరీని బ్రిటీష్ ఫిల్మ్ మేకర్ ఆంటోని బాక్స్‌టర్ నిర్మించారు. అమెరికా అధ్యక్షుడి ఎన్నికల్లోగా దీన్ని విడుదల చేస్తానని ఆయన మీడియాకు తెలిపారు. దీన్ని నిర్మించడం వెనక తనకు రెండు లక్ష్యాలు ఉన్నాయని, ట్రంప్ వేధింపులకు గురవుతున్న మోలీ ఫోర్బ్స్‌ను న్యాయం జరగాలని కోరుకోవడం ఒకటైతే అలాంటి వ్యక్తిని ఓ దేశాధ్యక్షుడిగా ఎలా ఎన్నుకుంటారని అమెరికన్లను ప్రశ్నించడం రెండో లక్ష్యమని ఆయన అన్నారు.
స్కాట్‌లాండ్ తన తల్లి ఊరవడంతో అక్కడ ట్రంప్ రెండు లగ్జరీ గోల్ఫ్ కోర్టులను నిర్మించారు. అబర్డీన్‌షైర్‌లో నిర్మించినదానికి ‘ట్రంప్ ఇంటర్నేషనల్ గోల్ఫ్ లింక్స్’ అని పేరు పెట్టగా, అయిర్‌షైర్‌లో నిర్మించిన గోల్ఫ్ కోర్టుకు ‘టర్న్‌బెర్రీ’ అని పేరు పెట్టారు.