ఆ అధ్యక్ష అభ్యర్థికి ఫ్రెండ్స్ గుర్తు లేరట
వాషింగ్టన్: రిపబ్లికన్ పార్టీ తరుపున అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఉండి ఎన్నికల ప్రచారంలో భాగంగా సంచలన ప్రకటనలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న డోనాల్డ్ ట్రంప్ మరోసారి ఆసక్తికరమైన విషయం చెప్పారు. తనకు ఇరవైమంది ముస్లిం స్నేహితులు ఉన్నారని చెప్పారు. అయితే, వారి పేర్లు చెప్పేందుకు మాత్రం నిరాకరించారు. కనీసం ఒక్కరి పేరు చెప్పలేదు. ఎన్నికల ప్రచారంలోకి వచ్చి రాగానే ముస్లింలకు వ్యతిరేకంగా ట్రంప్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అమెరికాలోకి ముస్లింల ప్రవేశాన్ని అడ్డుకోవాలంటూ ప్రకటించిన విషయం విధితమే. ఈ మాటల అనంతరం ట్రంప్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి.
పలువురు ముస్లిం నేతలు రుసరుసలాడారు. ఈక్రమంలో ఎన్నికల ఫలితాల్లో తన మాటల ప్రభావం ఉంటుందని ఊహించిన ట్రంప్ దిద్దుబాటు చర్యలకు దిగారు. మొన్న జరిగిన ప్రచారంలో 'నేను ముస్లింలను ప్రేమిస్తాను' అని చెప్పిన ఆయన తాజాగా, తనకు ముస్లిం స్నేహితులు ఉన్నారని చెప్పారు. కాగా, ట్రంప్ కుమారుడు మాత్రం తన తండ్రికి ముస్లిం స్నేహితులు ఉన్నారనే విషయంపై ఏమాత్రం స్పందించలేదు. అయితే, తాను మిడిల్ ఈస్ట్ లో వ్యాపార లావాదేవీల నిర్వహించినట్లు చెప్పారు.