వాషింగ్టన్: మానవాళి మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్న కరోనా వైరస్(కోవిడ్-19) అగ్రరాజ్యం అమెరికాను గడగడలాడిస్తోంది. మహమ్మారి కారణంగా ఇప్పటికే అక్కడ 28 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. దాదాపు ఆరు లక్షల మంది ప్రాణాంతక వైరస్ బారిన పడ్డారు. ఇటువంటి తరుణంలో కరోనా కల్లోలానికి అతలాకుతలమవుతున్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం శ్వేతసౌధంలో మీడియాతో మాట్లాడిన ట్రంప్.. ‘‘కరోనా కొత్త కేసుల సంఖ్యలో దేశ వ్యాప్తంగా మనం శిఖర స్థాయిని దాటేసి.. కోలుకుంటున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మనమంతా కలిసి ఎదురునిలిచి.. దేశాన్ని పూర్వస్థితికి తీసుకురావాలి’’అని పేర్కొన్నారు. (2022 వరకు భౌతిక దూరం పాటిస్తేనే..)
అదే విధంగా దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 33 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించామని.. త్వరలోనే యాంటీ బాడీస్ టెస్టులు కూడా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఇక ఈ పరిణామాలు లాక్‌డౌన్‌ను ఎత్తివేసే అంశంలో కీలక ప్రభావం చూపుతాయని ట్రంప్ వ్యాఖ్యానించారు. కోవిడ్-19 కేసులు తక్కువగా ఉన్న కొన్ని రాష్ట్రాలు ఏప్రిల్ చివరి వారం కంటే ముందే ముఖ్య కార్యకలాపాలు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఆయా రాష్ట్రాల గవర్నర్లతో కాన్ఫరెన్స్ కాల్ ద్వారా చర్చించనున్నట్లు పేర్కొన్నారు. లాక్‌డౌన్ ఎత్తివేస్తేనే ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకునే అవకాశాలు ఉన్నాయని సంకేతాలు జారీ చేశారు.(ట్రంప్ టీంలో మన దిగ్గజాలు)
కాగా ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో శ్వేతసౌధ కరోనా వైరస్ టాస్క్‌ఫోర్స్ ప్రతినిధి డెబోరా బిర్క్స్.. అమెరికన్లంతా భౌతిక దూరం పాటిస్తూనే ఉండాలని విజ్ఞప్తి చేశారు. సమావేశాలకు దూరంగా ఉండాలని కోరారు. కొన్ని రాష్ట్రాలు మాత్రం త్వరలోనే తిరిగి తెరుచుకోనున్నాయని ఆమె స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 1000 కంటే తక్కువ కేసులు నమోదైన, సగటున రోజు 30 కేసులు మాత్రమే బయటపడుతున్న రాష్ట్రాల్లో లాక్‌డౌన్ నిబంధనలు సడలించనున్నట్లు పేర్కొన్నారు. అర్కాన్సస్, హవాయి, మైన్, మెంటానా, నెబ్రాస్కా, నార్త్ డకోటా, వెర్మోంట్, వెస్ట్ వర్జీనియా, యోమింగ్ తదితర రాష్ట్రాల్లో పరిస్థితి ఈ విధంగా ఉందని వెల్లడించారు. (కరోనా: డబ్ల్యూహెచ్‌ఓకు షాకిచ్చిన ట్రంప్!)
‘‘ఈ రాష్ట్రాల గవర్నర్లు, మేయర్లు లాక్‌డౌన్ నిబంధనల విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. తమ పౌరులకు హాని కలిగించని విధంగా వారి ప్రణాళికలు ఉండాలి’’అని ఆమె స్పష్టం చేశారు. ఈ విషయంపై స్పందించిన న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ క్యూమో దశల వారీగా రీఓపెనింగ్ చేస్తామని వెల్లడించారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవడం వంటి కఠిన నిబంధనలు అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. కాగా కరోనా ధాటికి అత్యధిక మరణాలు న్యూయార్క్‌లోనే సంభవించిన విషయం తెలిసిందే. ఇక కరోనా లాక్‌డౌన్ కారణంగా అమెరికాలో నిరుద్యోగ సమస్య రికార్డు స్థాయికి చేరుకున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ట్రంప్ ఈ మేరకు నిబంధనల సడలింపు అంశంపై నిర్ణయం తీసుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment