వాషింగ్టన్: 'మనం ఎంతో హాయిగా, ఆనందంగా జీవిస్తున్నాం. మనకెందుకండీ ఈ రాజకీయాలు? అయినా మీరెందుకు ప్రెసిడెంట్ కావాలనుకుంటున్నారు? అఫ్కోర్స్ పోటీచేస్తే తప్పక గెలుస్తారనుకోండి. కానీ మీరు అధ్యక్షుడు కావటం నాకైతే ఇష్టం లేదు'.. ఈ వ్యాఖ్యలు ఎవరివో తెలుసా? అమెరికా అధ్యక్ష పదవి కోసం రిపబ్లికన్ పోటీదారుగా బరిలోఉన్న డోనాల్డ్ ట్రంప్ మూడో భార్య మెలానియావి.
అధ్యక్ష పదవికి పోటీ పడటంపై తన భార్యలు ఏమన్నారో సాక్షాత్తు ట్రంపే ఆదివారం వాషింగ్టన్ పోస్ట్ కు ఇచ్చిన సుదీర్ఘ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఎన్నికల్లో పోటీ చేస్తానంటే ఆయన పెద్ద భార్య (మాజీ) ఇవానా సరేనందట కానీ చిన్నభార్య మెలానియోనే వద్దందట. ఇదిలా ఉంటే స్లోవేయిన్ మోడల్ అయిన మెలానియో సోమవారం నుంచి భర్త ట్రంప్ కోసం ప్రచారం చేయనున్నారు. విస్కోన్సిస్ లో నేడు జరగనున్న క్యాంపెయిన్ లో మెలానియో తనతో కలిసి పాల్గొంటారని ట్రంప్ చెప్పారు.
మరోవైపు ట్రంప్ అబార్షన్ వ్యాఖ్యలను మొదటిభార్య ఇవానా సమర్థించారు. 'విడిపోయినప్పటికీ అప్పుడప్పుము మేం మాట్లాడుకుంటాం. అబార్షన్లపై ట్రంప్ అలా మాట్లాడటంలో తప్పేమీ లేదని నా అభిప్రాయం. అయితే తీవ్రమైన వ్యాఖ్యలు కాబట్టి ఫోన్ చేసి కామ్ గా ఉండమని సలహా ఇచ్చా. కానీ ఆయన కామ్ గా ఉండే టైప్ కాదు. ఔట్ స్పోకెన్'అని ఇవానా అన్నారు.
అబార్షన్ చేయించుకునే మహిళలను శిక్షించాలని గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు ట్రంప్ క్షమాపణలు చెప్పారు. రిపబ్లికన్ ప్రత్యర్థి టెడ్ క్రూజ్ భార్యను దుద్దేశించి చేసిన వ్యాఖ్యలపై కూడా ఆయన బాధను వ్యక్తపరిచారు. ప్రస్తుతం అమెరికా అర్థిక పరిస్థితి నీటిబుడగా ఉందని, అది ఏక్షణమైనా పేలిపోయే అవకాశం ఉందన్నారు. తనను అధ్యక్షుడిగా గెలిపిస్తే ఎనిమిదేళ్లలో అమెరికాకున్న మొత్తం అప్పులు(19 ట్రిలియన్ డాలర్లు) తీర్చిపారేస్తానని గట్టి హామీ ఇచ్చారు ట్రంప్. అధికారం చేపట్టిన 100 రోజుల్లోగా వాణిజ్య సరళిని మార్చేసి సైనిక ఒప్పందాలను సమీక్షిస్తానని, నాటోలో అమెరికా పాత్రపైనా దృష్టిసారిస్తానని చెప్పుకొచ్చారు.