ట్రంప్ పేరిట డ్రగ్స్.. ఫ్లోరిడాలో కలకలం
ఫ్లోరిడా: మత్తుమందుల(డ్రగ్స్) పంపిణీ దారులు మరో ముందడుగేశారు. ఎవ్వరూ ఊహించిన విధంగా కొకైన్, గంజాయి వంటి మత్తుపదార్థాలను వీధుల్లో కుప్పలుగా పోగేసి అమ్మేందుకు వినూత్న పంథాలో ముందుకెళ్లేందుకు యోచించారు. వారి ప్రణాళిక చూసి పోలీసులు బిత్తరపోయారు. సాధారణంగా ఇప్పటివరకు డోప్, మ్యాక్, చైనా వైట్, బ్రౌన్ షుగర్, మెక్సికన్ మడ్, బ్లాక్ టార్, స్నో బాల్ లాంటి పేర్లతో డ్రగ్స్ చేరవేస్తున్నప్పటికీ తాజాగా మాత్రం ఏకంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పేరుతో ఆయన ముఖచిత్రాన్ని ముద్రించిన కవర్‌లో డ్రగ్స్ పెట్టి విక్రయాలు ప్రారంభించారు.
ఫ్లోరిడాలోని హెర్నాడోలో జరుగుతున్న డ్రగ్స్ వ్యవహారంపై గత ఆరు నెలలుగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారణ ప్రారంభించారు. ఆ విచారణలో భాగంగా వారు పలు చోట్ల వివిధ పేర్లతో దొరికిన డ్రగ్స్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. అలా వారు పట్టుకున్న వాటిల్లో ఎక్కువ మొత్తంలో డోనాల్డ్ ట్రంప్ అనే పేరిట ఉన్న డ్రగ్స్ లభించడంతో వారు ఖిన్నులయ్యారు. అలా వారికి లభించిన మొత్తం ప్యాకెట్లు 5,500పైనే. దీనిపై ఫ్లోరిడా అటార్నీ జనరల్ పామ్ బోండి పత్రికా సమావేశంలో మాట్లాడుతూ ‘అధ్యక్షుడు ఫొటోను ముద్రించి ఇలా చేయడం చాలా పెద్ద తప్పు. డీలర్ ఈ డ్రగ్స్‌ను వీధుల్లోకి పంపించి విక్రయాలు జరపాలనుకోవడమే కాకుండా ఓ భయానక వాతావరణం సమాజంలో సృష్టించాలని అనుకున్నాడు. ఇది అతడు చేసిన పెద్ద తప్పు. ఈ కేసు వ్యవహారాన్ని ఓవల్ ఆఫీసుకు అందిస్తాను. ఆ సమయంలో ట్రంప్‌కు ఈ డ్రగ్ ప్యాకెట్ చూపిస్తాము’ అని కూడా ఆమె చెప్పారు.
గతంలో ట్రంప్‌తో బోండికి విభేదాలు ఉన్నాయి. ఫ్లోరిడా నుంచి పోటీ పడే సమయంలో ఆస్తుల వివరాలు సక్రమంగా తెలియజేయలేదనే కేసులో, ట్రంప్ యూనివర్సిటీ కేసు విషయంలో, ఆయన స్వచ్ఛంద సంస్థల విషయంలో అటార్నీ జనరల్ నిక్కచ్చిగా వ్యవహరించి అబ్బురపరిచారు. ఆ సమయంలో ట్రంప్ ఆమె సిన్సియారిటీని కొనియాడారు కూడా.