వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇప్పటికీ ఓటమి అంగీకరించకుండా మొండిగా వ్యవహరిస్తున్న డొనాల్డ్ ట్రంప్ విధిలేని పరిస్థితుల్లో శ్వేతసౌధాన్ని వీడారు. అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణ స్వీకారానికి కొద్ది గంటల ముందు బుధవారం ఉదయం ట్రంప్, ఆయన సతీమణి మెలానియాలు వైట్‌హౌస్ వీడి ఫ్లోరిడాకు వెళ్లారు. ముందుగా చెప్పినట్టుగానే బైడెన్ ప్రమాణస్వీకారోత్సవానికి ఆయన హాజరు కాలేదు. అధ్యక్షులు మాత్రమే వినియోగించే మెరైన్ వన్ హెలికాప్ట్టర్‌లో ఫ్లోరిడాలోని తాను నివాసం ఉండబోయే మార్ ఏ లాగో ఎస్టేట్‌కి ట్రంప్ దంపతులు చేరుకున్నారు.
వైట్‌హౌస్‌లోని సౌత్ లాన్‌లో మెరైన్ వన్ హెలికాప్టర్‌లోకి వెళ్లడానికి ముందు ట్రంప్ తనకు వీడ్కోలు చెప్పిన మద్దతుదారులు, సిబ్బందిని ఉద్దేశించి క్లుప్తంగా మాట్లాడారు. ఏదో ఒక రూపంలో తాను మళ్లీ ఇక్కడికి వస్తానని చెప్పారు. ఈ నాలుగేళ్లు చాలా గొప్పగా గడిచాయన్న ట్రంప్ తాము ఎంతో సాధించామని గర్వంగా ప్రకటించుకున్నారు. ‘‘ఇది నాకెంతో గౌరవం, జీవితకాలంలో లభించిన గౌరవం. ప్రపంచంలోనే మీరంతా గొప్ప ప్రజలు. ఈ జగత్తులోనే గొప్ప ఇల్లు ఇది’’ అని కొనియాడారు. ‘‘నేను మీ కోసం ఇంకా పోరాటం చేస్తాను. ఏదో ఒక రకంగా మళ్లీ వస్తా’’ అని ట్రంప్ అన్నారు.
నిండైన ఆత్మవిశ్వాసంతో వెళుతున్నా
వైట్ హౌస్ మంగళవారం విడుదల చేసిన ట్రంప్ ప్రసంగం వీడియోలో తమ ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రస్తావించారు. ‘‘నేను ఎన్నో కఠిన పరీక్షలు ఎదుర్కొన్నాను. గట్టి పోరాటాలే చేశాను. మీరు అప్పగించిన బాధ్యతలన్నీ సక్రమంగా నెరవేర్చాను. ఇప్పుడు నిండైన ఆత్మ విశ్వాసంతో శ్వేతసౌధాన్ని వీడుతున్నా. మా ప్రభుత్వం సాధించిన విజయాల్ని గుర్తు చేసుకుంటూ గర్వంగా మీ ముందు నిలబడ్డాను. వైట్‌హౌస్ వీడి వెళుతున్నప్పటికీ తాను ప్రజాసేవలోనే ఉంటా’’ అని ట్రంప్ చెప్పారు. ఈ చివరి వీడ్కోలు ప్రసంగం దాదాపు 20 నిమిషాల పాటు సాగింది.
ట్రంప్ నోట్
న్యూయార్క్: నూతన అధ్యక్షుడి ప్ర మాణస్వీకార సమయంలో పదవి వీడుతున్న అధ్యక్షుడు పాటించాల్సిన దాదాపు అన్ని సంప్రదాయాలను పక్కనబెట్టిన ట్రంప్.. ఒక సంప్రదా యాన్ని మాత్రం పాటిం చారు. కొత్త అధ్యక్షుడి కోసం వైట్‌హౌస్‌లోని అధ్యక్షుడి అధికారిక కార్యాలయంలో ఒక సందేశాన్ని ఉంచారు. ఓవల్ ఆఫీస్‌లోని రెజొల్యూట్ డెస్క్‌లో ఈ నోట్‌ను ట్రంప్ పెట్టారు. బైడెన్ ప్రమాణ స్వీకారం కన్నా ముందే ట్రంప్ వాషింగ్టన్‌ను, వైట్‌హౌస్‌ను వీడి ఫ్లారిడాకు పయనమయ్యారు.
బైడెన్‌కు మోదీ అభినందనలు
న్యూఢిల్లీ: అమెరికా 46వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన జో బైడెన్‌కు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. భారత్–అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు గాను బైడెన్‌తో కలిసి పనిచేయడానికి కంకణబద్ధుడనై ఉన్నానని పేర్కొన్నారు. ఉమ్మడి సవాళ్లను ఎదుర్కొనేందుకు, అంతర్జాతీయ శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఐక్యంగా నిలుద్దామని అమెరికా నాయకత్వానికి పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment