ఓర్లాండోలో అభిమానులకు అభివాదం చేస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దంపతులు
వాషింగ్టన్: దేశాభివృద్ధికి సంబంధించి అసంపూర్తిగా ఉన్న తన అజెండాను పూర్తి చేయడం కోసం తనకు మరో నాలుగేళ్లు అవకాశం ఇవ్వాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజలకు విజ్ఙప్తి చేశారు. 2020లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ పోటీ చేస్తున్న ట్రంప్ మంగళవారం ఫ్లోరిడాలో జరిగిన భారీర్యాలీలో అధికారికంగా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. వచ్చే ఎన్నికలకు ‘కీప్ అమెరికా గ్రేట్’ అన్న కొత్త నినాదాన్ని ట్రంప్ ఖాయం చేశారు. ‘అమెరికాకు రెండో సారి అధ్యక్షుడు కావడం కోసం అధికారికంగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడం కోసం మీ ముందుకొచ్చా.
మిమ్మల్ని ఎన్నడూ తలదించుకునేలా చేయనని హామీ ఇస్తున్నా’ అని 73 ఏళ్ల ట్రంప్ తన మద్దతుదారులనుద్దేశించి అన్నారు. ఈ ర్యాలీకి 20 వేల మందికిపైగా రిపబ్లికన్ పార్టీ మద్దతుదారులు హాజరయ్యారు. తన హయాంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ ప్రపంచానికే కన్నుకుట్టేంతగా ఎదిగిందని అన్నారు. దేశాన్ని నాశనం చేయాలని చూస్తే సహించేది లేదని ప్రతిపక్ష డెమోక్రాట్లను హెచ్చరించారు. మూడేళ్ల క్రితం తాను సాధించిన విజయం అమెరికా చరిత్రలోనే సువర్ణ ఘట్టమన్నారు. అమెరికా ఫస్ట్ విధానాన్ని కొనసాగిస్తానని, వలస విధానాలను కఠినతరం చేస్తానని, రక్షణ వ్యయాన్ని పెంచుతానని ట్రంప్ హామీ ఇచ్చారు.
తన హయాంలో దేశం గణనీయమైన పురోగతి సాధించిందని, వచ్చే ఎన్నికల్లో తాను ఓడిపోతే ఆ అభివృద్ధి అంతా ఆగిపోతుందని 80 నిముషాల తన ప్రసంగంలో ట్రంప్ పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తానన్న ధీమా వ్యక్తం చేశారు. ‘మనం నిరంతరం ముందుకెళ్తున్నాం. పోరాడుతున్నాం. గెలుస్తున్నాం’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ట్రంప్ సతీమణి మెలానియాసహా ఆయన కుటుంబ సభ్యులు, ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ట్రంప్ ప్రసంగిస్తుండగా ‘మరో 4 సంవత్సరాలు’ అన్న నినాదాలతో ర్యాలీ దద్దరిల్లింది. దేశాన్ని సామ్యవాదంవైపు నెట్టేందుకు డెమోక్రాట్లు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. అమెరికాను ఎప్పటికీ సామ్యవాద దేశం కానీయనని హామీ ఇచ్చారు.
ఈ రెండున్నరేళ్లతో తాము చేసినంత అభివృద్ధి ఇంకెవరూ చేయలేదన్నారు. అక్రమల వలసలను కఠినంగా అణిచివేస్తామని ఉద్ఘాటించారు. ‘తమ ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు డెమోక్రాట్లు అక్రమ వలసలను చట్టబద్ధం చేయాలంటున్నారు. డెమోక్రాట్లు దేశాన్ని వెనక్కి తీసుకెళ్లాలనుకుంటున్నారు’ అని అన్నారు. ట్రంప్ వైఫల్యాలను తాము ఎత్తిచూపుతామని డెమోక్రటిక్ నేషనల్ కమిటీ సభ్యుడు జాన్ సాంతోస్ అన్నారు. ఆరోగ్య సంరక్షణ, వలసవిధానాలు, ముస్లింలపై నిషేధం వంటి ట్రంప్ నిర్ణయాలు ఇక్కడి దక్షిణాసియా ప్రజల జీవితాల్ని దుర్భరం చేశాయన్నారు. 2020 నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు అమెరికా మాజీ అధ్యక్షుడు జోయ్ బిడెన్‌సహా దాదాపు పాతిక మంది ప్రయత్నిస్తున్నారు. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి ఎంపికకు సంబంధించిన ప్రైమరీ ప్రక్రియ వచ్చే ఏడాది మొదలుకానుంది.
Comments
Please login to add a commentAdd a comment