భారీ ఉగ్రకుట్ర భగ్నం
ఈజిప్టులో 10 మంది ఉగ్రవాదుల కాల్చివేత
కైరో : ఈజిప్టులో భద్రతా బలగాలు భారీ ఉగ్ర కుట్నను భగ్నం చేశాయి. సెంట్రల్ కైరో సమీపంలోని అర్ద్ ఎల్లేవా జిల్లాలో ఓ అపార్ట్‌మెంట్‌లో దాక్కుని ఉన్న 10 మంది ఉగ్రవాదులను ఆదివారం మట్టుబెట్టాయి. ఉగ్రవాదుల ఎదురుకాల్పుల్లో ముగ్గురు అధికారులు సహా ఐదుగురు భద్రతా సిబ్బంది గాయపడినట్లు ఓ ఉన్నతాధికారి మీడియాకు తెలిపారు.
ఉగ్రవాదులు దేశంలో పలుచోట్ల దాడులకు ప్రణాళిక రచిస్తున్నట్లు నిఘా వర్గాల నుంచి పక్కా సమాచారం అందిందన్నారు. దీంతో ఉగ్రవాదులు నక్కిన భవంతిని భద్రతా బలగాలు చుట్టుముట్టాయని వెల్లడించారు. వీరి కదలికల్ని గమనించిన ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారని తెలిపారు. భద్రతా బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో దాదాపు 10 మంది ఉగ్రవాదులు హతమయ్యారని వెల్లడించారు.
ఈ ఉగ్రవాదులందరూ నిషేధిత ముస్లిం బ్రదర్‌హుడ్ సంస్థ నుంచి వేరయిన వారిగా అనుమానిస్తున్నట్లు పేర్కొన్నారు. సంఘటనాస్థలం నుంచి భారీ ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 2013లో అధ్యక్షుడు మొహమ్మద్ మోర్సీ ప్రభుత్వాన్ని సైన్యం రద్దుచేసిన అనంతరం ఈజిప్టులో ఆర్మీ, పోలీసులపై ఉగ్ర దాడులు భారీగా పెరిగాయి.